
మోదీ, చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : దేశాన్ని ప్రగతి పథాన నడిపించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మోదీ, చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య అన్నారు. కడప నగరంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ భవన్‌లో సీపీఐ కడప నగర సమితి ఏడో మహా సభలు శుక్రవారం నిర్వహించారు. ముందుగా కడప నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్, గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ మీదుగా విశ్వేశ్వరయ్య మందిరం వరకూ ర్యాలీగా వస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచిపెడుతున్నారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి లౌకిక రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేయడం, మనుస్మతి విధానాలతో పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, బాబు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాయని, చంద్రబాబు 21 సార్లు దిల్లీకి వెళ్లి రూ.3600 కోట్లు అప్పు తెచ్చారన్నారు. పెండింగ్‌లో ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి బసకచర్ల నిర్మాణం అంశాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని తప్పుబట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మరో 40 వేల ఎకరాల భూ సేకరణ, మెట్రో రైలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నాయని, మద్యం అమ్మగా వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎన్.వెంకటశివ, ఎల్.నాగసుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, జి.వేణుగోపాల్, విజయలక్ష్మి, నాగార్జునరెడ్డి, చెంచయ్య మల్లికార్జున, మనోహర్‌రెడ్డి, లింగన్న పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
జి.ఈశ్వరయ్య