
ఎమ్మెల్యే చెప్పారని పట్టా భూమిలో రోడ్డేశారు
కడప రూరల్ : ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ అనుచరులమంటూ కొంతమంది వచ్చారు. వారితోపాటే స్థానిక తహసీల్దారు తన సిబ్బందితో వచ్చారు. ఎమ్మెల్యే చెప్పారంటూ తమకు చెందిన 2.25 సెంట్ల స్థలంలో అక్రమంగా రోడ్డు వేశారు. న్యాయం చేయాలంటూ బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లెకు చెందిన మన్యం సుబ్బలక్ష్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
ఆమె తన కుమారుడు రామచంద్రారెడ్డితో కలిసి గురువారం కడపకు వచ్చారు. అక్కడ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఉండడంతో ఆయను తన సమస్య విన్ననించారు. తమ గ్రామంలోని సర్వేనెంబర్ 82లో 2.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఈ నెల 5న సర్వేయర్ వచ్చి తమ భూమికి బౌండరీ లైన్ ఫిక్స్ చేసి సరిహద్దు రాళ్లు ఏర్పాటుచేశారని తెలిపారు. 16న తహసీల్దారు, కొందరు వ్యక్తులు వచ్చారని, తాము ఎమ్మెల్యే అనుచరులం అంటూ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. దౌర్జన్యంగా తమ భూమి చుట్టూ వేసిన ఇనుప కంచె తొలగించారని ఆరోపించారు. అధికారులు తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా దారిని ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరుగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. స్పందించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ఱెడ్డి న్యాయం చేయాలని బద్వేల్ ఆర్‌డీఓకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే చెప్పారని నోటీసులు ఇవ్వకుండా పట్టా భూమిలో రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించారు. తక్షణం బాధితురాలి సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఇప్పటికే బద్వేల్ ఆర్‌డీఓ, జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
రవీంద్రనాఽథ్‌రెడ్డి