చింతకొమ్మదిన్నె : కడప సమీపంలోని ఇందిరానగర్‌లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జాకు తెగబడుతున్నారు. అధికారపార్టీ పెద్దల పేర్లు చెప్పి పార్కు, హౌసింగ్, ప్రజావసరాలకు రిజర్వు చేసిన స్థలాలను చదును చేసేస్తున్నారు. తమ సొంత భూముల్లా ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. కబ్జాదారులు, అధికార నేతల పేర్లు చెబుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇందిరానగర్ వాసులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 732లో హౌసింగ్‌కు రిజర్వు చేసిన స్థలానికి అధికార పార్టీ నాయకులు బోగస్ డి.పట్టా సృష్టించి ప్లాట్‌లు వేశారు. ఒక్కో రూ.4 లక్షల ధర చెప్పి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బుధవారం సాయంత్రం చింతకొమ్మదిన్నె రెవెన్యూ అధికారుల వివరణ కోరగా తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని, సిబ్బందిని పంపి ప్రభుత్వ స్థలంలో వేసిన ప్లాట్ల రాళ్లను తొలగించడం జరిగిందన్నారు.