
భార్య చేతిలో భర్త హతం
కడప అర్బన్ : రోజూ మద్యం తాగి అనుమానంతో గొడవపడడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య గోడకేసి తోసింది.. బలమైన దెబ్బ తగలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కడపలో బుధవారం చోటుచేసుకుంది. కడప వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు..కడప నగరంలోని ఎర్రముక్కపల్లి బాల వికాస్ హైస్కూల్ వెనుక వీధిలో దేరంగుల సుబ్బరాయుడు(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య హరిత, కుమార్తె, కుమారుడు వున్నారు. ఈ క్రమంలో సుబ్బరాయుడు ప్రతి రోజూ మద్యం తాగివస్తుండడంతె భార్య హరిత గొడవపడేది. హరిత ఇంటి ప్రక్కనే ఆమె తల్లి, సోదరుడు హరికృష్ణ నివాసముంటున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో దేరంగుల సుబ్బరాయుడు మద్యం తాగి భార్య హరితతో గొడవపడ్డాడు. అదే సమయంలో హరిత అన్న హరికృష్ణ వచ్చి ఎందుకు రోజూ మద్యం తాగి గొడవపడతావని నిలదీశాడు. వాగ్వాదం పెరగడంతో తన భర్తను హరిత గోడకేసి తోసింది. గోడ మోటు బలంగా తగలడంతో సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు మృతుడి భార్య హరిత, బావమరిది హరికృష్ణలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప వన్‌టౌన్ సీఐ బి.రామకృష్ణ, ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రోజూ మద్యం సేవించి వస్తున్నాడని వాగ్వాదం
ఈ ఘటనలో భార్యతో పాటు,
బావమరిది నిందితుడే