
జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పొడిగింపు
కడప సెవెన్ రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య బీమా గడువు 2025–26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించిందని ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారీ రూ.2 లక్షల విలువ చేసే వైద్య సేవలు అందుతాయన్నారు. ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. ఎంప్లాయీస్ హె ల్త్ స్కీమ్ తరహాలో వైద్య సేవలు పొందవచ్చని, ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని పేర్కొన్నారు. నిర్దేశిత చికిత్సకు ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని వివరించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియో గించుకోవాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జివోవి.ఐఎన్ వెబ్‌సైట్ ద్వారా హెడ్ ఆఫ్ అకౌంట్ 8342–00–120–01–03–001–001డీడీవో కోడ్ 2703–0802–003 అనే పద్దుకు రూ.1250 చెల్లించి వచ్చే ఏడాది మార్చి 31 వరకు హెల్త్ స్కీం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ జిరాక్సు, హెల్త్ స్కీమ్ దరఖాస్తు, కుటుంబ సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డు కాపీ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
ప్రతిభ గల క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : క్రీడాకారులు ప్రతిభ చూపితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మెన్ జిల్లా సెలెక్షన్స్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా ఫుట్‌బాల్ జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సుధీర్‌కుమార్, ఎన్.అనిల్ కుమార్, హరి, ఎం.గంగయ్య, తదితరులు పాల్గొన్నారు