
గండి ఉత్సవాలకు పక్కా ప్రణాళిక
చక్రాయపేట : గండిలో శ్రావణ మాసోత్సవాలకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పాలకమండలి సభ్యులు సహకరించాలని ఆలయ సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య విజ్ఙప్తి చేశారు. ఉత్సవాల నిర్వహణపై చైర్మన్ కావలి కృష్ణతేజ అధ్యక్షతన గండి క్షేత్రంలోని ఈవో కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాజగోపురం నిర్మాణం నేపథ్యంలో ఇరుకుగా ఉన్న రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్యను ఆయన కోరారు. ప్రతి శనివారం భక్తుల రద్దీని బట్టి అద్దాలమర్రి క్రాస్, ఇడుపులపాయ క్రాస్ వద్దే వాహనాలు ఆపేయాలని, ట్రాఫిక్ ఆంక్షలు విధించడమేగాక, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటుచేస్తామని సీఐ వివరించారు. ఉత్సవ సమయంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటామని చక్రాయపేట వైద్యాధికారిణి వాణి చెప్పారు. విద్యుత్తు, నీటి సమస్య, బారికేడ్లు, క్యూలైన్లు, దుకాణాల నిర్వహణ, అలంకరణ, రవాణా సౌకర్యాలు, అగ్నిమాపక శాఖ పాత్రలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కేసరి, రాజా రమేష్, పాలకమండలి సభ్యులు రాశినేని మధు, పబ్బతి బిందుసాగర్, కొండారెడ్డి, మాజీ చైర్మన్ వెంకట స్వామి, అధికారులు పాల్గొన్నారు.
టెండర్లు మళ్లీ వాయిదా
గండి ఆలయ పరిధిలో టోల్‌గేట్ వసూలుకు నిర్వహించిన టెండర్లు మూడో సారీ వాయిదాపడ్డాయి. ధరావత్తు చెల్లించిన వారు వేలం పాడకపోవడంతో నిలిపివేసినట్లు ఈవో వెంకటసుబ్బయ్య తెలిపారు. శ్రావణ మాసంలో ప్రత్యేక పుష్పాలంకరణ నిమిత్తం పూలు సరఫరా చేసే హక్కు పొందే టెండర్‌కు హెచ్చు పాట పాడిన మల్లికార్జునకు టెండరు ఖరారు చేశామని ఆయన తెలిపారు.