
వైవీయూలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో 2025– 26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం వైవీయూలోని ప్రిన్సిపల్ చాంబర్‌లో పలువురు డీన్లతో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)– 2020ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంలో భాగంగా బీఎస్సీ(హానర్స్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్, ఎర్త్ సైన్స్ కోర్సులలో త్వరలో ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. బీఎస్సీ(ఆనర్స్) ఫిజిక్స్ సబ్జెక్టుతోపాటు కంప్యూటర్ సైన్స్, నానో–సైన్స్, కంప్యూటేషనల్ ఫిజిక్స్, డేటా సైన్స్, ఫిజిక్స్, టెక్నాలజీలను విద్యార్థులు ఎంపిక చేసుకొని చదివే అవకాశం ఉందన్నారు. బీఎస్సీ (ఆనర్స్) రసాయన శాస్త్రం మేజర్ సబ్జెక్టుగా తీసుకోవడంతోపాటు అప్లికేషన్ కెమికల్ సైన్స్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ చదవచ్చన్నారు. బీకాం (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ ప్రధాన అంశంగా కలిగి ఉందన్నారు. ఈ సమావేశంలో పూర్వ ప్రధానాచార్యులు, ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, డీన్ ఫర్ అకడమిక్ అఫైర్స్ చంద్ర ఓబులరెడ్డి, డీవోయే డైరెక్టర్ టి లక్ష్మి ప్రసాద్, ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ ఆచార్య విజయభారతి తదితరులు పాల్గొన్నారు.