
వివాదాస్పద ఫ్లెక్సీ కేసులో ఇద్దరు అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కేసులో డాక్టర్‌తోపాటు ఫ్లెక్సీ డిజిటల్ షాపు యజమానిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ రాత్రి దాదాపు 7 గంటల సమయంలో కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ వద్ద ‘ఎంత పని సేచ్చివయ్య జగనూ’ అని హెడ్డింగ్ పెట్టి 12 పాయింట్స్ కలిగిన ఒక బ్యానర్‌ను చైన్నె చిల్డ్రెన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నారపురెడ్డి నాగార్జునరెడ్డి, గ్లేస్ ఫ్లెక్సీ డిజిటల్ షాపు యజమాని అమృతరాజు ఏర్పాటు చేశారన్నారు. ఈ బ్యానర్‌ను పరిశీలించగా అందులో రెండు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి, ఘర్షణ వాతావరణం సృష్టించి ప్రజా శాంతికి, లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా ఉండటంతో.. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై వచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు క్రైం నంబరు 148/2025, యు/ఎస్ 61(2) 325 ఆర్–డబ్ల్యు 3(5) బి.ఎన్.ఎస్ కింద వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి వారిని మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఎవరైనా కానీ తమకు గల వాక్ స్వాతంత్రపు హక్కును దుర్వినియోగం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాస్పద అంశాలు కలిగిన బ్యానర్‌లను తయారు చేయకూడదని ఫ్లెక్సీ ప్రింటింగ్ తయారీ యజమానులకు డీఎస్పీ సూచించారు. వివాదాస్పద అంశాలు కలిగిన బ్యానర్‌లు తయారు చేయాలని మీ వద్దకు ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్‌కు తెలియజేయాలన్నారు. బ్యానర్ కింద ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఫోన్ నంబరును తప్పకుండా ముద్రించాలన్నారు.