
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
కడప అర్బన్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పలు దొంగతనాలు చేసిన నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన అంతర్ రాష్ట్ర దొంగ గజ్జల శ్రీనివాస్ (47)ను అరెస్టు చేయడంతోపాటు మరో బాల నేరస్తున్ని అదుపులోకి తీసుకున్నట్లు కడప డీఎస్పి ఏ. వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను తెలియజేశారు. గజ్జల శ్రీనివాస్‌పై ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 15 కేసులు ఉన్నాయన్నారు. చలమారెడ్డి పల్లి ఎమ్మెస్సార్ హిల్స్‌లోని ఒక ఇంటిలో, కడప పాత బైపాస్ రోడ్డులోని వెంకట సాయినగర్‌లోని 2 ఇళ్లలో, సాయి నగర్‌లో ఒక ఇంటిలో చోరీ చేశాడన్నారు. కొన్ని రోజులుగా జరిగిన దొంగతనాలకు సంబంధించిన చోరీ సొమ్మును అతని వద్ద నుంచి పూర్తిగా రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన వాటిలో ఒక జత బంగారు బుట్ట కమ్మలు, ఒక బంగారు ఉంగరం, ఒక కేజీ 500 గ్రాముల వెండి వస్తువులు, మోటార్ సైకిల్, ఆరు చేతి గడియారాలు, రెండు కెమెరాలు ఉన్నాయని తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడ ప ఆర్చి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి ఇంకొక బాలనేరస్తుడిని అదుపులోకి తీసుకొని ఈ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయ డంలో కృషి చేసిన కడప చిన్నచౌక్ ఇన్‌స్పెక్టర్ జి.ఓబులేసు, ఎస్‌ఐలు రాజరాజేశ్వర్‌రెడ్డి, రవికుమార్, సీసీఎ స్ సిబ్బందిని, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ చంద్రమోహన్, సుదర్శన్‌రెడ్డి, ఏఎస్‌ఐ సుబ్బరాజు, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుల్ ఖాదర్ హుస్సేన్, శ్రీనివాసులు, మాధవరెడ్డి, సుధాకర్ యాదవ్ నాగరాజులను కడప డీఎస్పీ అభినందించి రివార్డుల కోసం సిఫార్సు చేసినట్లు వివరించారు. ఈ కేసు ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.
1.5 కేజీల వెండి, బంగారు స్వాధీనం