
కార్పొరేటర్‌కు బ్రోకర్‌గా పని చేస్తున్నావా?
కడప కార్పొరేషన్ : ప్రభుత్వ విప్, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి మరోసారి రెచ్చిపోయారు. సచివాలయ ఉద్యోగి అయిన వీఆర్‌ఓపై నోరుపారేసుకున్నారు. పది మంది చూస్తుండగానే ‘నీవు కార్పొరేటర్‌కు బ్రోకర్‌గా పని చేస్తున్నావా’ అని వీఆర్‌వోపై మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు– ఇంటింటికీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని 30వ డివిజన్‌లో ప్రభుత్వ విప్ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఇటీవల తన రేషన్ కార్డులో ఉన్న అమ్మానాన్నలను తొలగించి.. తమ భర్త, పిల్లలతో రేషన్ కార్డు చేయించాలని వీఆర్‌ఓ మహేందర్‌ను ఆశ్రయించింది. ఆయన డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని కలవాలని సూచించారు. కాగా సదరు సెక్రటరీ ఆ ఫ్యామిలీకి హెడ్ అయిన భర్త వేలిముద్రలు కావాలని చెప్పడంతో.. ఆమె మళ్లీ వీఆర్‌ఓ వద్దకు వచ్చి చెప్పింది. ఈ విషయం 30వ డివిజన్‌లో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవికి తెలియడంతో ఆమె చిర్రెత్తిపోయారు. ‘రేషన్ కార్డులో ఏం సమస్య ఉందో చెప్పి పరిష్కరించడమే నీ పని.. నీలాంటి బ్రోకర్లను పెట్టుకొని నడుపుతున్నారు. కార్పొరేటర్ పేరు రాసి ఆయన్ను కలువు.. పో అంటావా.. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ కార్పొరేటర్‌కు బ్రోకర్‌గా పని చేస్తున్నావా? నగర ప్రజలు కార్పొరేటర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలా.. వాళ్లింటి దగ్గర కూర్చొని వారు రేషన్ కార్డులిస్తే తీసుకోవాలి’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో నివ్వెరపోయిన వీఆర్‌ఓ తాను అలా అనలేదని చెబుతున్నా వినకుండా నోర్మూయ్ అంటూ ఎమ్మెల్యే మాధవి గదమాయించారు. సాక్షాత్తు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర సమక్షంలో పది మంది ముందూ ఇలా ప్రభుత్వ ఉద్యోగిని బ్రోకర్ అంటూ పరుష పదజాలం ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచిచూడాలి.
వీఆర్‌ఓపై టీడీపీ ఎమ్మెల్యే
మాధవి దుర్భాషలు
తాను అలా అనలేదని వీఆర్‌ఓ చెబుతున్నా.. నోర్మూసుకో అంటూ గదమాయింపు