
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు క్రిష్ణవేణి, మూలే సరస్వతితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన నాయకులు రాళ్లు, కట్టెలు, బండరాళ్లతో దాడులు చేయడం హేయమన్నారు. అక్కడ పోలీసులు ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో ఓ వైద్యుడు 32 మంది విద్యార్థినుల వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదన్నారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి గానీ, డిప్యూటీ సీఎం గానీ, హోంమంత్రి గానీ స్పందించిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని, మహిళలపై దాడులు జరక్కుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గవర్నర్ జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, మహిళా నేతలు పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి, బి.మరియలు, సుశీలమ్మ, తులశమ్మ, నారాయణమ్మ, మల్లీశ్వరి, సుజిత, పద్మ, శివమ్మ పాల్గొన్నారు.