
హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణం అడ్డగింత
చింతకొమ్మదిన్నె : పవర్ గ్రిడ్ సంస్థ చేపట్టిన అనంతపురం– కడప 400 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణపు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని అభ్యంతరం తెలుపుతూ రైతులు పనులు అడ్డుకున్నారు. చింతకొమ్మదిన్నె చెరువులో పవర్ గ్రిడ్ సంస్థ చేపట్టిన హైటెన్షన్ విద్యుత్ టవర్ నిర్మాణ ప్రాంతానికి వారు సోమవారం చేరుకుని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి నిర్మాణాన్ని నిలుపుదల చేయించారు. విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం తయారు చేసిన డిజైన్ కడప– రాయచోటి జాతీయ రహదారి వెంట ఉన్న పొలాల్లో 3 కిలోమీటర్లకుపైగా వెళ్తోందని వారు తెలిపారు. జాతీయ రహదారికి సమాంతరంగా పొలాల మీదుగా విద్యుత్ లైన్ల టవర్ల నిర్మాణానికి పవర్ గ్రిడ్ సంస్థ లోపభూయిష్టమైన డిజైన్ల తయారీ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఏడాది క్రితమే పవర్ గ్రిడ్ సంస్థ అధికారులను అనంతపురం, గుత్తి, కడప కార్యాలయాలలో సంప్రదించి అర్జీలు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అప్పుడే కడప జిల్లా కలెక్టర్‌కు కూడా గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.
విలువైన భూములు కోల్పోవాల్సి
వస్తోందని ఆవేదన
పక్కా వ్యాపార సంస్థ అయిన పవర్ గ్రిడ్ సంస్థ అత్యంత విలువైన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పొలాల మీదుగా నిర్మాణానికి లోపభూయిష్టమైన డిజైన్లు తయారు చేయడంతో కోట్లాది రూపాయల విలువైన భూములు కోల్పోవాల్సి వస్తోందన్నారు. దీనివల్ల తమ పిల్లల భవిష్యత్తు, చదువులు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొలుములపల్లె పంచాయతీ పాలకవర్గం, అధికారులు కూడా ఇదివరలోనే తమ గ్రామ పొలాల మీదుగా హై టెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతూ రెజూల్యూషన్ కూడా పాస్ చేసి పవర్ గ్రిడ్ అధికారులకు అందజేశారని తెలిపారు. నెల క్రితం కూడా కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్, చింతకొమ్మదిన్నె మండల తహసీల్దార్ నాగేశ్వరరావు సమక్షంలో క్షేత్రస్థాయి పర్యటనకు పవర్ గ్రిడ్ అధికారులు వచ్చినప్పుడు కూడా అభ్యంతరం తెలిపినట్లు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి తమ బాధను అర్థం చేసుకుని కడప నగర అభివృద్ధికి కూడా ఆటంకంగా ఈ విద్యుత్ లైన్ల నిర్మాణపు డిజైన్ ఉందని భావించి.. వారు సమీపంలోనే ఉన్న చింతకొమ్మదిన్నె చెరువు నుంచి గుట్టపై నుంచి పవర్ గ్రిడ్ కార్యాలయం వరకు విద్యుత్ లైన్ల నిర్మాణానికి రీడిజైన్ చేసుకోవాల్సిందిగా పవర్ గ్రిడ్ అధికారులకు సూచించారని తెలిపారు.
అనుమతి లేకుండా..
అయినా పవర్ గ్రిడ్ అధికారులు తీరు మార్చుకోక ఇటీవల తిరిగి రెవెన్యూ అధికారులకే పాత డిజైన్ మేరకు నిర్మాణం చేపట్టేందుకు పోలీసు భద్రత కల్పించాల్సిందిగా చింతకొమ్మదిన్నె తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొలుములపల్లి గ్రామ పొలంలో నష్టపోతున్న రైతులు, చింతకొమ్మదిన్నె రైతులు సోమవారం చింతకొమ్మదిన్నె చెరువులో అక్రమంగా ఎటువంటి పర్మిషన్ ఇరిగేషన్ అధికారుల నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి తీసుకోకుండా ఏర్పాటు చేస్తున్న హైటెన్షన్ విద్యుత్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకుని అధికారులతోనే నిలిపి వేయించారు. ఇప్పటికై నా పవర్ గ్రిడ్ అధికారులు, వారి ఉన్నతాధికారులు స్పందించి హై టెన్షన్ విద్యుత్ లైన్ల లోపభూయిష్టమైన డిజైన్లు మార్పు చేసుకుని సమీపంలోని గుట్టలపై నుంచి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. అలా జరగకపోతే తాము ప్రాణాలు సైతం త్యాగం చేసైనా సరే.. విద్యుత్ లైన్ల నిర్మాణాలను తమ భూముల నుంచి వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
డిజైన్ లోపభూయిష్టంగా ఉందని
రైతులు అభ్యంతరం
డిజైన్ మార్చే వరకు అనుమతించబోమని అల్టిమేటం