
వైభవంగా హుసేనిపీర్ దర్గా ఉరుసు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని దర్గావీధిలో వెలసిన హుసేని పీర్ దర్గా 200వ ఉరుసు మహోత్సవాలు స్వామి ఐదవ తరం వారసులు మున్వర్‌బాషా, సలీం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఉరుసు సందర్భంగా బద్వేలు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలిరావడంతో దర్గా ఆవరణమంతా భక్తులతో కిక్కిరిసింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున స్వామి వారసులు గంధం ఎత్తుకుని మేళతాళాల నడుమ ఊరేగింపుగా వెళ్లి స్వామి సమాధికి ఎక్కించి అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ఆవరణలో మొక్కుబడి ఉన్న భక్తులు అన్నదానం నిర్వహించారు. చివరిరోజు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉరుసు సందర్భంగా రాత్రి ఏర్పాటు చేసిన ఖవ్వాలి కార్యక్రమం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే పకీరుల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్వామి వారసులు దర్గారహమతుల్లా, దర్గాషఫివుల్లా, దర్గాకరీముల్లా, ఆర్గనైజర్లు షరీఫ్, అంజాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వైభవంగా హుసేనిపీర్ దర్గా ఉరుసు