
ఎర్రచందనం కేసుల్లో నిందితుడిపై అటవీ అధికారుల దాడి
మైదుకూరు : ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఇడగొట్టు నాంద్రపై సోమవారం అటవీ అధికారులు దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తనపై అటవీ అధికారులు దాడి చేశారంటూ బాధితుడు రిమ్స్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం జీవీ సత్రంలో సోమవారం నాగేంద్ర మరొక వ్యక్తితో కలిసి కారులో వెళుతుండగా అటవీ అధికారులు వారిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. నాగేంద్ర పక్కనున్న వ్యక్తి పారిపోగా అటవీ అధికారులు నాగేంద్రపై దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బాధితున్ని అటవీ అధికారులే తమ వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. వైద్య పరీక్షల్లో నాగేంద్ర కుడికాలు ఎముక విరిగినట్టు గుర్తించిన ఆస్పత్రి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు పంపారు. అటవీ అధికారులు తనపై దాడి చేసినట్టు రిమ్స్ ఔట్ పోస్టులో నాగేంద్ర ఫిర్యాదు చేశాడు.
నాగేంద్రపై దాడి చేయలేదు : ప్రొద్దుటూరు డీఆర్‌ఓ
ఎర్రచందనం కేసుల్లో నిందితుడుగా ఉన్న నాగేంద్రపై దాడి చేయలేదని ప్రొద్దుటూరు డీఆర్‌ఓ లక్ష్మీకుమారి పేర్కొన్నారు. జీవీ సత్రంలో జరిగిన సంఘటన అనంతర ఆమె వివరణతో కూడిన వీడియోను విడుదల చేశారు. అనుమానాస్పదంగా ఉన్న కారును వెంబడించగా కారులోని వ్యక్తులు దిగి పారిపోబోయారని తెలిపారు. అందులో ఒకరు పారిపోగా కాలు మడతపడి గాయంతో నాగేంద్ర పట్టుబడ్డాడని పేర్కొన్నారు. వనిపెంటకు చెందిన నాగేంద్ర పలు రేంజ్‌లలో ఐదారు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడని తెలిపారు. మల్లేపల్లె వద్ద ఎర్రందనం దుంగల స్టాక్ ఉందని దుంగలను తరలించేందుకు తాము తాడిపత్రి నుంచి వాహనాన్ని తీసుకుని వచ్చినట్టు విచారణలో నాగేంద్ర తమకు వెల్లడించాడని డీఆర్‌ఓ తెలిపారు. పారిపోయిన వ్యక్తి పేరు పవన్‌కుమార్‌రెడ్డిగా పేర్కొన్నట్టు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగేంద్ర ఇప్పుడు కూడా ఎర్రచందనం దుంగలను తరలించేందుకు వచ్చి పట్టుపడ్డాడని వివరించారు.
రిమ్స్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసిన
బాధితుడు