ఇల్లు ఖాళీ చేయించారని.. | - | Sakshi
Sakshi News home page

ఇల్లు ఖాళీ చేయించారని..

Jul 14 2025 5:09 AM | Updated on Jul 14 2025 5:09 AM

ఇల్లు ఖాళీ చేయించారని..

ఇల్లు ఖాళీ చేయించారని..

ప్రొద్దుటూరు క్రైం : పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడి మనుషులమంటూ కొందరు వ్యక్తులు.. ఓ ఇంట్లోకి ప్రవేశించి భార్యా భర్తలపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. అలాగే ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో దంపతులిద్దరూ ప్రాణభయంతో బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. తిరిగి భర్తపై దాడి చేయడంతో తీవ్ర మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాధితుడు మల్లికార్జునుడు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రమాదేవి మిట్టమడివీధిలో నివాసం ఉంటున్నారు. తమకు తెలిసిన సందీప్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తికి డబ్బు అవసరం కావడంతో.. తమ ఇంటిని 2014లో ఇద్దరు వ్యక్తులకు కుదవ పెట్టి రూ. 23 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని సందీప్‌కుమార్‌రెడ్డికి ఇచ్చారు. ఆరు నెలల్లో డబ్బు ఇస్తానని చెప్పిన అతను.. తర్వాత పత్తా లేకుండా పోయాడు. తాము మోసపోయామని, తీసుకున్న మొత్తం ఇస్తామని చెప్పినా ఇంటిని తనఖా పెట్టుకున్న వ్యక్తులు అంగీకరించలేదు. అప్పటి నుంచి ఇంటికి సంబంధించిన పంచాయితీ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌ నెలలో సింహాద్రిపురం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వారి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ప్రమీలాదేవి దంపతులను బెదిరించి వారిపై దాడి చేశారు. ఇంటి నుంచి బయటికి పంపించారు. ఈ ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దంపతులపై దాడి చేయడంతో..

ఇదిలా ఉండగా సింహాద్రిపురం మండలానికి చెందిన ఒక వ్యక్తి చొరవతో ప్రమీలాదేవి దంపతులు తిరిగి వారి ఇంట్లోకి వెళ్లారు. అయితే రెండు రోజులు కూడా గడవక ముందే.. గతంలో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు వచ్చి తిరిగి వారిపై దాడి చేశారు. ఇంటికి తాళం వేసి వాళ్లను బయటకు గెంటేశారు. దీంతో ప్రమీలాదేవి దంపతులు ప్రాణభయంతో పోట్లదుర్తిలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మల్లికార్జునుడు మరో వ్యక్తితో కలిసి ప్రొద్దుటూరులోని మున్సిపల్‌ పార్కు వద్దకు వెళ్లాడు. సింహాద్రిపురం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి రావడంతో మల్లికార్జునుడు వారిని చూసి భయంతో పరుగులు తీశాడు. ఈ విషయాన్ని అతను భార్య ప్రమీలాదేవికి చెప్పగా భయం, మనస్తాపంతో అదే రోజు రాత్రి ఆమె వాస్మోల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమీలాదేవి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై బాధితులు ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేశారు.

న్యాయం చేయాలని సీఎం, డిప్యూటీ సీఎంలకు వేడుకోలు

రెండు రోజుల క్రితమే ప్రమీలాదేవి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లను వేడుకున్నారు. డబ్బులు కడతామని చెప్పినా సింహాద్రిపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మూడంతస్తుల ఇంటిని స్వాధీనం చేసుకొని దౌర్జన్యంగా బయటికి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఏడాది నుంచి ఎన్నో సార్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆమె రోదించసాగారు. ఎవరూ తనకు న్యాయం చేయలేదని, తాను చివరి స్టేజీలో ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతూ విలపించారు. నిజానిజాలు తెలుసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. తర్వాత రెండు రోజులకే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేశారు.

నేనెప్పుడు వాళ్లను స్టేషన్‌కు పిలిపించలేదు

ఈ విషయమై వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా.. ప్రమీలాదేవి దంపతులను తానెప్పుడు స్టేషన్‌కు పిలిపించలేదన్నారు. తాను రాకముందు నుంచి వారి ఇంటికి సంబంధించిన సమస్య నడుస్తోందని తెలిపారు. తాను ఎవ్వరినీ కొట్టలేదని సీఐ వివరణ ఇచ్చారు.

మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement