
కడప పాఠశాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
కడప ఎడ్యుకేషన్ : కడప నగర పాలక సంస్థ పరిధిలోని సాయిపేట 8వ వార్డు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నెల 10వ తేదీన నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ (మెగా పీటీఎం 2.0) సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు సంబంధించిన ఫొటో ఫ్రేమ్ రూపకల్పనలో పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన చిత్రానికి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానం లభించింది. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర పోర్టల్‌లో ముఖచిత్రంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల ఫొటో చిత్రాన్ని తన స్టేటస్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాది నాగరాజుతోపాటు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు.