
● పేరెంట్స్ మీటింగు నిర్వహించేదే లే!
అట్లూరు : ‘మా ఊరు పాఠశాల మా ఊరులోనే ఉంచే వరకూ మా పాఠశాలలో మెగాపేరెంట్ టీచర్ మీట్(పీటీఎం)ను నిర్వహించవద్దని’మండల పరిధిలోని చెన్నేపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల పేరంట్స్ స్పష్టం చేశారు. మీటింగును పూర్తిగా అడ్డుకున్నారు. ఎస్.వెంకటాపురం పాఠశాలను మోడల్ పాఠశాలగా మార్చి చెన్నేపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివే 3,4,5 తరగతుల విద్యార్థులను తరలించాలని ఉపాధ్యాయులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇక్కడే చదవాలి.. అక్కడకు పంపించం అంటూ చెన్నేపల్లి కాలనీ విద్యార్థుల తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అధికారుల ఆలోచన విరమించే వరకూ మీటింగు నిర్వహించవద్దు అంటూ ప్లెక్సీలు చేతపట్టుకుని పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి విలియంరాజు అక్కడకు చేరుకుని సమావేశం నిర్వహణకు తల్లిదండ్రులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళతానని ఆయన వెనుదిరిగారు.