
సొమ్మొకరిది.. సోకొకరిదన్నట్లు ఎమ్మెల్యే వ్యవహారం
● 13 నెలల్లో నగరపాలక సంస్థకు
నయాపైసా నిధులు తేలేదు
● మేం ప్రతిపాదించి, ఆమోదించిన పనులకు శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటు
● తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన
మేయర్ సురేష్‌బాబు
● 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12.70 కోట్ల పనులకు శంకుస్థాపన
కడప కార్పొరేషన్ : ‘సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లు కడప ఎమ్మెల్యే మాధవి వ్యవహారం ఉంది’ అని మేయర్ సురేష్ బాబు విమర్శించారు. మంగళవారం 5,9,10, 11,12,13, 14, 20, 21,23, 24 డివిజన్లలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12.70 కోట్లతో చేపడుతున్న పనులను ఆయన ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2014–19 వరకూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని అప్పుడు కూడా జిల్లా అభివృద్ధికి గానీ, కడప నగరాభివృద్ధికి గానీ ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలవున్నా నగరపాలక సంస్థకు నయాపైసా నిధులు ఇవ్వలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం కింద నిధులు మంజూరైతే డివిజన్లలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ప్రతిపాదించగా, తాము సర్వసభ్య సమావేశంలో ఆమోదించామన్నారు. డిసెంబర్ 23న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి నానా రచ్చ చేసి 15వ ఆర్థిక సంఘ పనులు ప్రతిపాదించిన అజెండా పేపర్లను చించి వేశారని, ఇప్పుడేమో ఆ పనుల ప్రారంభోత్సవాలకు పాలవర్గ సభ్యులను గానీ, మేయర్‌గా తనను గానీ పిలవకుండా ఏకపక్షంగా ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందిందంటే అది వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల వల్లేనన్నారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నగరాభివృద్ధికి రూ.2400 కోట్లు విడుదల చేశారన్నారు. నగరంలో ఏడు రహదారులను విస్తరించి సుందరీకరణ చేశామని, రూ.57 కోట్లతో బుగ్గవంక వాల్‌ను పూర్తి చేసి, 40 అడుగులతో అప్రోచ్ రోడ్లు మంజూరు చేశామన్నారు. రూ.78 కోట్లతో వరదనీటి కాలువల నిర్మాణం చేపట్టామన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన నిధులపై
శ్వేతపత్రం విడుదల చేయాలి
కడప నగరపాలక సంస్థ కమిషనర్ ఎమ్మెల్యే మాధవి బంధువు కావడం వల్ల .. అంతా ఆమె చెప్పినట్లు జరుగుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కడప నగరానికి రూ.10 కూడా మంజూరు చేయలేదని, ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధులను జీవోలు, తేదీలు మార్చి తమ ఘనతగా చెప్పుకోవడం దారుణమన్నారు. బుగ్గవంకపై నాగరాజుపేట, షామీరియా మసీదుల వద్ద బ్రిడ్జిలకు గత ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస్తే.. గెలిచిన వెంటనే ఆ బ్రిడ్జిల వద్దకు పోయి ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇంతవరకూ చేయలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైతే ఆ టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దని ఎమ్మెల్యే బెదిరించారని, ఆ టెండర్లన్నీ నలుగురికే కట్టబెట్టారన్నారు. కార్పొరేషన్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు మేయర్‌ను, కార్పొరేటర్లను పిలవకుండా.. వార్డు మెంబర్‌గా గెలవలేని వారితో టెంకాయలు కొట్టించడం అన్యాయమన్నారు. శిలాఫలకాల కోసం, అందులో తన పేరు కోసం ఎమ్మెల్యే పాకులాడుతున్నారే తప్ప, ప్రజా సమస్యలపై కాదన్నారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, మల్లికార్జున, గంగాదేవి, వై.మాధవి, కె.బాబు, మేసా ప్రమీలరాణి, రామలక్ష్మణ్‌రెడ్డి, షఫీ, డివిజన్ ఇన్‌చార్జులు బండి ప్రసాద్, మేసా ప్రసాద్, ఐస్‌క్రీం రవి, వైఎస్సార్‌సీపీ నాయకులు పి.జయచంద్రారెడ్డి, దాసరి శివప్రసాద్, బీహెచ్ ఇలియాస్, శ్రీరంజన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, యానాదయ్య, గుంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.