
సహజీవనానికి అడ్డొస్తున్నాడని హత్య
జమ్మలమడుగు : తన సహ జీవనానికి అడ్డు వస్తున్నాడని షేక్షావలీ అనే యువకుడిని జాఫర్‌వలీ అనే వ్యక్తి హత్య చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీన ఎర్రగుంట్ల మార్కెట్ యార్డు ఆవరణంలో జరిగిన షేక్షావలీ అనే యువకుడి హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన హసీనా భర్త 15 ఏళ్ల క్రితం మరణించాడు. ఆ తర్వాత ప్రొద్దుటూరుకు చెందిన జాఫర్‌వలీ అనే వ్యక్తి హసీనాతో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. గత నెల 26వ తేదీన హసీనా కడపలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది. జాఫర్‌వలీ ఆమె కోసం కడపకు వెళ్లాడు. అక్కడ ఉన్న హసీనా అన్న షేక్షావలీ నీవు ఇక్కడికి రావద్దు.. మా చెల్లెలిని వదలిపెట్టు అంటూ జాఫర్‌వలీని మందలించాడు. దీంతో షేక్షావలీపై జాఫర్‌వలీ కక్ష పెంచుకున్నాడు. తన సహ జీవనానికి అడ్డుగా ఉన్న అతన్ని అంతమొందించాలని పథకం పన్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన జాఫర్‌వలి కడపలో షేక్షావలీ నివాసం ఉంటున్న వీధిలోకి వెళ్లాడు. అక్కడ ఎదురుపడిన షేక్షావలీతో జాఫర్ వలీ మాట్లాడి ఇద్దరం కలిసి మద్యం తాగుదాం రమ్మంటూ కడప రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత ఎర్రగుంట్లలో కుక్కలను పట్టుకుంటే ఒక్కో కుక్కకు రూ. 300 ఇస్తారని నమ్మించి షేక్షావలీని ఎర్రగుంట్లకు పిలుచుకుని వచ్చాడు. కడప రోడ్డులో ఉన్న బ్రాందీ షాపులో తిరిగి మద్యం తాగారు. తర్వాత ఎర్రగుంట్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో పాత గోడౌన్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి వచ్చారు. పథకం ప్రకారం తక్కువ మోతాదులో మద్యం తాగిన జాఫర్‌వలీ మద్యం మత్తులో పడిపోయిన షేక్షావలీ తలపై అక్కడ ఉన్న ఇటుక, బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎర్రగుట్ల సీఐ నరేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జాఫర్‌వలీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సీఐ నరేష్‌బాబుతో పాటు మరి కొందరు కానిస్టేబుళ్లను అభినందిస్తూ రివార్డులను అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
యువకుడి హత్య కేసును
ఛేదించిన పోలీసులు