
చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం!
కడప కోటిరెడ్డిసర్కిల్ : చిన్నారుల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్ఠికాహారాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సింది పోయి.. కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క నాసిరకం కందిపప్పును సరఫరా చేస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఇదే దుస్థితి నెలకొంది. పురుగులతో బూజు పట్టిన కందిపప్పును సరఫరా చేయడంపై చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వైఎస్సార్ జిల్లాలో 2389 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 1,02,235 మంది చిన్నారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. అలాగే 13,256 మంది గర్భిణులు, 13,719 మంది బాలింతలు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం పౌష్ఠికాహారం అందజేసేందుకు బాల సంజీవిని పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పది రకాల నిత్యావసర సరుకులను అందజేస్తారు. అందులో బియ్యం మూడు కేజీలు, కందిపప్పు ఒక కిలో, నూనె 500 ఎంఎల్, 25 కోడిగుడ్లు, ఐదు లీటర్ల పాలు, 2 కిలోల రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల బెల్లం, ఎండు ఖర్జూరాలు 250 గ్రాములు, వేరుశనగ చిక్కీలు 250 గ్రాములు అర్హులైన ప్రతి లబ్ధిదారు ఇంటికి సరఫరా చేస్తారు. ఈ పంపిణీలో భాగంగా ఇటీవల కూటమి ప్రభుత్వం జిల్లాలోని అంగన్వాడీ చిన్నారులు, గర్బిణీలు, బాలింతలకు కందిపప్పును సరఫరా చేసింది. ఇలా సరఫరా చేసిన కందిపప్పు పురుగు పట్టి నాసిరకంగా ఉండడం అనేక విమర్శలకు తావిస్తోంది.
కమీషన్ల కోసం కక్కుర్తి
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యాన్ని కూటమి సర్కార్ గాలికొదిలేసింది. పౌష్ఠికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిపోయి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం కక్కుర్తిపడి పురుగు పట్టిన నాసిరకం కందిపప్పును కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలనలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు.
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 13
అంగన్వాడీ కేంద్రాలు 2389
చిన్నారులు 1,02,234
గర్భిణులు 13256
బాలింతలు 13,719
అంగన్వాడీలకు
పురుగుల కందిపప్పు పంపిణీ
జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి
తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
నాణ్యమైన సరుకులు ఇవ్వాలి
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పంపిణీ చేసే పౌష్ఠికాహారం నాణ్యతగా ఉండాలి. కూటమి ఫ్రభుత్వంలో కందిపప్పు నాసిరకం ఉంది. నిత్యావసర సరుకులను సకాలంలో అందించడంతోపాటు నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తే మాకు తిప్పలు తప్పుతాయి. ఈ విషయంగా ప్రభుత్వం సత్వరమే స్పందించాలి.
– మంజుల, రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్, కడప

చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం!