
గండి ఆలయ అధికారిపై విచారణ
చక్రాయపేట : ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయ అధికారి వెంకట సుబ్బయ్యపై శుక్రవారం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్(డీసీ) పట్టెం గురుప్రసాద్ విచారణ నిర్వహించారు. వెంకట సుబ్బయ్యపై ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ రాష్ట్ర గవర్నరుకు ఫిర్యాదు చేసినందున కమిషనర్ ఆదేశాల మేరకు తాను విచారణకు వచ్చినట్లు డీసీ తెలిపారు. విచారణ సందర్భంగా డిప్యూటీ కమిషనర్.. చైర్మన్, పాలక మండలి సభ్యులను, ఆలయ అధికారిని వేరు వేరుగా విచారించారు. తొలుత చైర్మన్ పాలకమండలికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఇంత వరకు ఎలాంటి పాలకమండలి సమావేశాలు నిర్వహించలేదని చెప్పారు. పాలక మండలి తీర్మాణాలు లేకుండా ఆయన వెంకటస్వామి అనే వ్యక్తిని పక్కన పెట్టుకొని ఇష్టారాజ్యంగా నిధులను డ్రా చేస్తూ ఖర్చు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా చైర్మన్‌కు, పాలక మండలికి ఆహ్వానం లేదని వెంకటస్వామి అనే వ్యక్తిచే జెండా ఆవిష్కరించారని ఫొటో చూపించి ఫిర్యాదు చేశారు. ఈనెల 26న జరిగిన షాపింగ్ గదులు, టోల్ గేట్ల టెండర్లలో ఏ అధికారం ఉందని వెంకటస్వామిని డయాస్‌పై తన పక్కనే ఏసీ ఎలా కూర్చోబెట్టుకుంటారని ప్రశ్నించారు. పైగా ప్రభుత్వం మారింది కదా.. మీరు ఇంకా పదవుల్లో ఎందుకున్నారు. రాజీనామా చేసి వెళ్లి పోండి అంటూ పాలక మండలి సభ్యులను హేళన చేస్తూ మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రావణ మాస ఉత్సవాలకు టెండర్లు పిలవకనే..
నిరుడు గండిలో జరిగిన శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని రు.కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పారు. పాలక మండలి తీర్మాణం లేకుండా, ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా టెండర్లు నిర్వహించకనే చలువ పందిళ్లు, క్యూలైన్లు, డెకరేషన్‌లు తదితరాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. వాటి జమా ఖర్చులు పాలక మండలి అడిగితే మీకెందుకు ఇవ్వాలి అంటూ అవమానాలకు గురి చేస్తున్నాడని వారు డీసీకి ఫిర్యాదు చేశారు.
నిరాహార దీక్ష చేస్తా..
గండి వీరాంజనేయ స్వామి మూలవిరాట్ దర్శనం శ్రావణ మాసం మొదటి వారం నాటికి భక్తులకు కల్పించక పోతే నిరాహార దీక్ష చేస్తానని చక్రాయపేట జడ్పీటీసీ సభ్యడు శివప్రసాదరెడ్డి డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్‌కు స్పష్టం చేశారు. ఆలయ అధికారి వెంకట సుబ్బయ్య నిర్లక్ష్యం కారణంగానే ఆలయం ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. అనంతరం ఆయన ఆలయ అధికారి వెంకట సుబ్బయ్యను కూడా పాలక మండలి చేసిన ఆరోపణలపై విచారించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు చక్రపాణిరెడ్డి, మధు, బిందు సాగర్, జయమ్మ, మునీశ్వరి, సుగుణమ్మ, వెంకటరామిరెడ్డి, కుమారి, కళావతి, మారెళ్లమడక సర్పంచ్ నరసింహులు పాల్గొన్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తా ..
గండి ఆలయ అధికారి వెంకటసుబ్బయ్యపై విచారణ చేసిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని కర్నూలు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విని రాత పూర్వకంగా తీసుకున్నానని, వీటిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతానని చెప్పారు.
అక్రమాలను డీసీకి వివరించిన చైర్మన్, పాలకమండలి
శ్రావణమాసంలో మూలవిరాట్ దర్శనం కల్పించక పోతే నిరాహార దీక్ష చేస్తానన్న జడ్పీటీసీ
నివేదికను ఉన్నతాధికారులకు
సమర్పిస్తానన్న డిప్యూటీ కమిషనర్