రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
పులివెందుల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు భద్రత కరువైందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదోక చోట మహిళలు, చిన్నారులపై అఘాయత్యాలు పెరిగిపోయాయన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా మహిళపై దాడి జరగడం దారుణమన్నారు. రాష్ట్ర హోం మంత్రిగా ఒక మహిళ ఉండి కూడా మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను ఏర్పాటు చేసి అండగా నిలవడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న టీడీపీ నేతలు అనేక కొర్రీలు పెట్టి ఎగ్గొట్టడం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం అందలేదన్నారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమకు ఇష్టం వచ్చిన రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపైన అక్రమ కేసులు బనాయించడం జరుగుతోందన్నారు. కొన్ని చోట్ల వీరి వేధింపులు తాళలేక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అటువంటి కుటుంబాల వారికి మనోధైర్యం నింపడానికి తమ పార్టీ అధినేత ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతుంటే.. దాన్ని కూడా ఆంక్షల పేరుతో ఈ ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం వారి నీచత్వానికి పరాకాష్టగా ఉందన్నారు. ఇటీవల పొదిలి పర్యటన సందర్భంగా తమ నాయకుడు వైఎస్ జగనన్నకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజులలో ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


