పునఃప్రారంభం అయిన నిత్యాన్నదాన కేంద్రం పనులు
పునఃప్రారంభం అయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు
టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులతో వాదిస్తున్న పామూరు సుబ్రమణ్యం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో ఈ నెల 11వ తేది ప్రారంభం అయ్యి 12వ తేది ఆగిపోయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు శుక్రవారం టీటీడీ అధికారులు పునఃప్రారంభించారు. అసలు విషయానికి వస్తే...ఈ నెల 11న రామాలయం ఆవరణలోని నామల వనం పక్కనే ఉన్న పార్కులో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులను ప్రారంభించారు. అయితే టీటీడీ పనులు ప్రారంభించిన ప్రదేశం తమది అంటు పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకుని అతని హద్దు వరకు కంచె వేసేందుకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి అక్కడ టీటీడీ చేస్తున్న తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు ఆగిపోయాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆలయ టీటీడీ అధికారులు విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారానికి టీటీడీ వీజీవో(విజిలెన్స్, భద్రత అధికారి) గిరిధర్ శుక్రవారం ఒంటిమిట్ట రామాలయం వద్దకు చేరుకున్నారు. సమస్యాత్మకంగా ఉన్న తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న నిత్యాన్నదానం కేంద్రానికి సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించి, అక్కడ పనులకు ఆటంకం కలిగించేందుకు పామూరు సుబ్రమణ్యం ఏర్పాటు చేసిన సిమెంట్ స్తంభాలను స్థానిక పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పామూరు సుబ్రమణ్యం ఘటన స్థలానికి చేరుకుని తమ స్థలానికి నష్టపరిహారం అందించి, అందులో ఏ పనులైనా చేసుకోవాలని వారితో వాదించారు. అయితే ఆయన వాదన విన్న వీజీవో గిరిధర్ తమది అంటున్న స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉంటే కోర్టు ఆదేశాలతో రావాలని ఆయన తెలిపారు. అంత వరకు ఇక్కడ పనులు ఆపే అర్హత వారికి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమీ లేక పామూరు సుబ్రమణ్యం కోర్టు ఆదేశాలతో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సీఐ నరసింహారాజు, టీటీడీ సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, స్థానిక విజిలెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పునఃప్రారంభం అయిన నిత్యాన్నదాన కేంద్రం పనులు


