సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి | - | Sakshi
Sakshi News home page

సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి

Dec 20 2025 7:06 AM | Updated on Dec 20 2025 7:06 AM

సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి

సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి

కడప ఎడ్యుకేషన్‌ : రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకొని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించిన అభ్యుదయ రచయిత గజ్జెల మల్లారెడ్డి అని కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు శాఖ, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గజ్జెల మల్లారెడ్డి శత జయంతి సదస్సు శుక్రవారం విశ్వవిద్యాలయంలోని మొల్ల సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం భాషల పట్ల వారధిగా పనిచేయడానికి కేంద్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. గజ్జెల మల్లారెడ్డి రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకున్నాడని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించాడన్నారు. అభ్యుదయ సాహిత్యానికి కడప జిల్లా కవులు ప్రధాన భూమిక పోషించారని, వారిలో రాచమల్లు రామచంద్రా రెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి, సొదుం జయరాం, గజ్జెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారని అన్నారు. మల్లారెడ్డి వేమన లాగే ప్రజల్లో తిరిగాడని, అందుకే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కవిత్వంగా మార్చాడన్నారు.

సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావాలన్నారు. గజ్జెల మల్లారెడ్డి సరళమైన భాషలో, క్లుప్తంగా,వ్యంగ్యాత్మంగా రాస్తారని అన్నారు. రాజకీయ విమర్శ చాలా సూటిగా ఉంటుందని ఉదహరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య టి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు వృత్తి బాధ్యతతో పాటు ఒక ప్రవృత్తిని ఎంచుకొని ముందుకు సాగితే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని, ఒకవేళ మన ప్రవృత్తి సాహిత్యం అయితే జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన శ్రీగజ్జెల మల్లారెడ్డి జీవిత చరిత్ఙ్ర పుస్తకం(మోనోగ్రాఫ్‌)ను అతిథులు ఆవిష్కరించారు. తెలుగు శాఖాధిపతి, కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా మండలి సభ్యులు, సదస్సు నిర్వాహకులు ఆచార్య ఎం. ఎం.వినోదిని స్వాగతం పలికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్‌ ఎం. ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ గజ్జెల మల్లారెడ్డి నిరంతరం రాజకీయాలను పరిశీలిస్తూ వర్తమాన అంశాలను కవిత్వంగా, వ్యాసాలుగా రాసేవారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు గజ్జెల మల్లారెడ్డి ఆత్మకథ అయిన ఆత్మసాక్షిపై మాట్లాడారు. మల్లారెడ్డి అనువదించిన సుహృల్లేఖనం, దమ్మపథం గ్రంథాలపై ప్రముఖ విమర్శకులు డా. పి. సంజీవమ్మ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు మేడిపల్లి రవికుమార్‌ మాట్లాడారు. గజ్జెల మల్లారెడ్డి గేయాల్లోని నిర్మాణ పద్ధతులను తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్‌ ఎన్‌.ఈశ్వర రెడ్డి ఉదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో కేంద్ర అకాడెమీ ప్రతినిధి టి.ఎస్‌. చంద్రశేఖర రాజు, సాహిత్య తెలుగు శాఖ ఆచార్యులు పి.రమాదేవి, జి. పార్వతి, ఆర్ట్స్‌ డీన్‌ ఆచార్య కె. గంగయ్య, పరిశోధకులు,పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.

కేంద్ర సాహిత్య అకాడెమీ

పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement