హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం
● మద్యం తాగొద్దని మందలించినందుకు..
● నరసింహుడును దారుణంగా
హత్య చేసిన నాగరాజు
● 2021లో జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో జరిగిన ఘటన
ప్రొద్దుటూరు క్రైం : జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో 2021లో జరిగిన హత్య కేసులో ప్రొద్దుటూరులోని ఎర్రన్నకొట్టాలకు చెందిన ఇల్లూరు నాగరాజు అనే నిందితుడికి ప్రొద్దుటూరు ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో 2021 అక్టోబర్ 24న జ్యోతుల పండుగ నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు గూడెంచెరువు గ్రామానికి చెందిన సర్వ నరసింహుడు అనే బంధువు మిద్దె లక్ష్మిదేవి ఇంటికి వచ్చాడు. వారింటి సమీపంలోనే వెంకటరాముడు నివాసం ఉంది. అతని అల్లుడైన ఇల్లూరు నాగరాజు కూడా పండుగ నిమిత్తం వెంకటరాముడు ఇంటికి వచ్చాడు. నాగరాజు మద్యం సేవించి అందరితో గొడవ పడుతుండటంతో నరసింహుడు అతన్ని వారించాడు. ఎందుకు మద్యం తాగి అందరితో గొడవ పడుతున్నావని సున్నితంగా మందలించాడు. దీన్ని నాగరాజు అవమానంగా భావించి మనసులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మరుసటి రోజున (2021 అక్టోబర్ 25న) నాగరాజు లక్ష్మీదేవి ఇంటి వద్దకు వెళ్లాడు. ‘అలా బయటికి వెళ్దాం రా..’ అని మాయమాటలు చెప్పి నరసింహుడును తీసుకెళ్లాడు. అలా నరసింహుడుతో కలసి వెళ్లిన నాగరాజు రక్తపు మరకలు కలిగిన షర్టుతో సాయంత్రం ఒంటరిగా ఇంటికి వచ్చాడు. అనుమానం కలిగిన లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు నరసింహుడు కోసం వెతికే క్రమంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తారస పడ్డాడు. నరసింహుడు గురించి అతన్ని అడుగగా మామిడి తోటలోకి వెళ్లి చూడమని చెప్పాడు. లక్ష్మీదేవి, ఆమె కుమారుడు రామ్మోహన్‌తో కలిసి తోటలోకి వెళ్లి చూడగా నరసింహుడు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు అప్పటి జమ్మలమడుగు అర్బన్ సీఐ జి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. నిందితుడు నరసింహుడును అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టులో జరుగుతూ వచ్చింది. తుది విచారణలో నేరం రుజువు కావడంతో ఇల్లూరు నాగరాజు అలియాస్ ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ సెకండ్ ఏడీజే జడ్జి కె సత్యకుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో అడిషనల్ పీపీ మార్తల సుధాకర్‌రెడ్డి వాదనలను వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ప్రస్తుత జమ్మలమడుగు సీఐ సురేష్, కోర్టు హెడ్‌కానిస్టేబుళ్లు నాగరాజు, మహబూబ్‌బాషా, ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.


