విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కడప నగరంలోని తన కార్యాలయంలో ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఓం శాంతి సంస్థ ప్రతినిధి ప్రదీప అక్కయ్యచే డ్రైవర్లకు యోగా, ధ్యానం ప్రాధాన్యతను తెలియజేసి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయించారు. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు పనితీరుతోనే ఆర్టీసీకి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయన్నారు. నిర్ణీత సమయంలో బస్సును నడిపినపుడే ప్రయాణీకుల మన్ననలు పొందవచ్చన్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అలాగే ప్రయాణీకులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రమాదాలకు అవకాశం ఉన్న అంశాలను తెలియజేశారు. పులివెందుల డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ ప్రమాదాలపై సమీక్ష చేశారు. డ్రైవర్లకు బ్లాక్ స్పాట్‌పై జాగ్రత్తలను తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపోలకు చెందిన 19 మంది డ్రైవర్లు, కండక్టర్లు హాజరయ్యారు.


