తల్లికి వందనం కార్మికులందరికీ వర్తింపజేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంతోపాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆప్కాస్, అంగన్వాడీ, మున్సిపల్, స్టీమ్ వర్కర్లందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికుల సమస్యలు రోజురోజుకు అధికమవుతున్నాయని సీఐటీయూ కార్యదర్శి మనోహర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకట సుబ్బయ్య అన్నారు. తాము అధికారంలోకి వస్తే రూ. 25 వేల కంటే తక్కువ వేతనం తీసుకుంటున్న వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక హామీలు విస్మరించడం దారుణమని విమర్శించారు. అంగన్వాడీ ఆయాకు రూ. 7 వేలు, టీచర్‌కు రూ. 11,500 మాత్రమే వేతనం ఇస్తున్నారని, వీరికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.లక్ష్మిదేవి, బి.లక్ష్మిదేవి, వరలక్ష్మి, భాగ్యమ్మ, సావిత్రి, విజయ తదితరులు పాల్గొన్నారు.


