కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోందని, నిన్న తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాలు విజయవంతమై ఈ విషయం స్పష్టమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం విజయవంతమైందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు బాధ, నిరాశ, నిస్పృహలతో ఉన్నారని, వారి ఆగ్రహం ఈ విధంగా వ్యక్తమైందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్, బీజేపీ నేతలు ఏ హామీలు ఇచ్చారో మర్చిపోయారని, ప్రజలు మాత్రం వాటిని బాగా గుర్తుంచుకున్నారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రూ.1.56 లక్షల కోట్లు అప్పు చేశారని, ఈ నిధులను దేనికి ఖర్చుపెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా అప్పులు చేసిందని, ఆ నిధులను డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలకు నేరుగా చేరవేయడం జరిగిందన్నారు. తల్లులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రైతులకు ఈ ప్రభు త్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. ఆ హామీలను వడ్డీతో సహా చెల్లించాలని ప్రజలు అడుగుతున్నారన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
అబ్బా కొడుకులు తమ డబ్బా కొట్టుకోవడానికే ఏడాది కాలం గడిచిపోయిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై మక్కువతో పాలనను గాలికొదిలేశారన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్న విధంగా తయారైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితమే వెన్నుపోట్లతో మొదలైందన్నారు. ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని కై వసం చేసుకున్నారన్నారు. కడపలో మహానాడు నిర్వహించి కడప మా అడ్డా అంటూ డబ్బా కొట్టుకున్నారని, నేడు వెన్నుపోటు దినం విజయవంతంతో రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీ అడ్డా అని రుజువైందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాగ్రహాన్ని అణిచివేయాలని చూసిన ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు దమ్ముంటే ఏడాది పాలనపై సంబరాలకు పిలుపు ఇవ్వాలని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలను వడ్డీతో సహా చెల్లించే వరకూ తాము ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పులి సునీల్, పి.జయచంద్రారెడ్డి, జి.శ్రీనివాసులరెడ్డి, సీహెచ్ వినోద్, షేక్ షఫీ, మునిశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘వెన్నుపోటు దినం’ విజయవంతం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి


