అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో డీఆర్‌ఓ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కింది స్థాయి సిబ్బందిని పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలన్నారు.
● గోపవరం మండలం రామాంజనేయ నగర్‌కు చెందిన బత్తల వెంకట్రామయ్య ఇంటి నివాస స్థలానికి సంబంధించి అనుబంధం పత్రం మంజూరు చేయాలని అభ్యర్థించారు.
● కడప నబీకోటకు చెందిన ఎస్. కమాల్ బీ వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం విన్నవించారు.
● కాశినాయన మండలం రెడ్డి కొట్టాల గ్రామానికి చెందిన కె.రంగలక్షుమ్మ వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
● చాపాడు మండలం ఓబయ్యపల్లికి చెందిన తప్పెట చంద్ర ఓబుల్ రెడ్డి తన భూమిని ఇతరులు ఆన్‌లైన్ చేసుకున్నారని, దానిని తొలగించి వెబ్ ల్యాండ్‌లో తన భూమి విస్తీర్ణం నమోదు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఎస్డీసీలు శ్రీనివాసులు, వెంకటపతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


