
పశువులు మేపుకునేందుకు వెళ్లి..
చాపాడు : మండల పరిధిలోని పల్లవోలు గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగు పడి బాలాయపల్లె సుబ్బ రమణయ్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలోని దళితవాడకు చెందిన బాలాయపల్లె సుబ్బరమణయ్య అలియాస్ సుబ్రమణ్యం శనివారం సాయంత్రం గేదెలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోని స్మశానవాటిక దగ్గర ఉండే పొలాల్లోకి వెళ్లాడు. ఇతనితో పాటు సమీపంలో మరికొంత మంది మహిళలు గేదెలను మేపుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను పడిపోయిన స్థలం వద్ద పశువులన్నీ గుంపుగా ఉండటంతో గుర్తించిన సమీపంలోని మహిళలు అతని వద్దకు వెళ్లారు. వెంటనే ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఆదిలక్ష్మితో పాటు యుక్త వయస్సుకు వచ్చిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిడుగు పాటుకు సుబ్బరమణయ్య మృతి చెందటంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి