చెరగని ముద్ర | - | Sakshi
Sakshi News home page

చెరగని ముద్ర

May 7 2025 1:31 AM | Updated on May 7 2025 1:31 AM

చెరగన

చెరగని ముద్ర

రాయచోటి రాజకీయాల్లో

రాయచోటి: రాయచోటిలో రాజకీయాల్లో సుగవాసి పాలకొండ్రాయుడు చెరగని ముద్ర వేశారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా పని చేసి.. సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించారు. అలాంటి అరుదైన నేత మృతితో.. రాయచోటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు(86) మంగళవారం వేకువజామున కన్నుమూశారు. ఆయన రాయచోటిలో రాజకీయ శూన్యత నెలకొన్న సమయంలో.. అప్పటి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల పిలుపు మేరకు.. 1977లో రాజకీయ అరంగేట్రం చేశారు. ముక్కుసూటి నేతగా పేరు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో కలిసి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో బలమైన ప్రజానేతగా ఎదిగిన ఆయన ఒక పర్యాయం జనతా పార్టీ నుంచి, రెండో పర్యాయం స్వతంత్ర అభ్యర్థిగా రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత కాలంలో ఎన్‌టి రామారావు స్థాపించిన టీడీపీలోకి అడుగు పెట్టిన నాటి నుంచి.. నేటి వరకు అదే పార్టీలో సీనియర్‌ నేతగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సఖ్యతతో రాజకీయ ప్రస్థానం సాగింది. తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు, ఒడిదిడుకులు ఎదుర్కొన్నారు. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోసం పని చేసి తనదైన శైలిని కొనసాగించారు.

● 1978లో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి తొలిసారిగా జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మహల్‌ హబీబుల్లాపై విజయం సాధించారు.

● 1983లో రాయచోటి నుంచి రెండవ సారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దివంగత మాజీ ఎమ్మెల్యే మహల్‌ హబీబుల్లా సతీమణి మహల్‌ షవరున్నీసాపై జయకేతనం ఎగురవేశారు.

● టీడీపీ స్థాపన అనంతరం ఎన్‌టీఆర్‌ ఆహ్వానించడంతో సుగవాసి ఆ పార్టీలో చేరారు.

● 1984లో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.సాయిప్రతాప్‌పై విజయం సాధించారు.

● 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి మండిపల్లి నాగిరెడ్డిపై పోటీ చేసి తొలి ఓటమిని చవిచూశారు.

● 1991లో రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి ఎ.సాయిప్రతాప్‌పై పోటీ చేసి ఓటమిని చవిచూశారు.

● 1992లో అప్పటి ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి అనంతరం రాయచోటి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో.. మండిపల్లి నారాయణరెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు.

● 1994లోనూ రాయచోటి అసెంబ్లీ స్థానానికి మండిపల్లి నారాయణరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.

● 1999లో రాయచోటి అసెంబ్లీ నుంచి మండిపల్లి నారాయణరెడ్డిపై సుగవాసి పాలకొండ్రాయుడు విజయం సాధించారు.

● 2004లో రాయచోటి నుంచి ప్రస్తుత మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోదరి మిన్నంరెడ్డి శ్రీలతరెడ్డిపైన విజయం సాధించారు.

● 2009లో రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్‌రెడ్డిపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇవే ఆయనకు చివరి ఎన్నికలు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి దిగలేదు. ఆయన రాజకీయ వారసులుగా కుమారులు సుగవాసి సుబ్రమణ్యం, సుగవాసి ప్రసాద్‌బాబు కొనసాగుతున్నారు. 31 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో 8 దఫాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నాలుగు సార్లు గెలుపొందారు. రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి రెండు దఫాలు పోటీ చేసి ఒక సారి ఎంపీగా విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

తిరుగులేని నేతగా ఎదిగిన పాలకొండ్రాయుడు

అభిమాన నాయకుడి మృతితో విషాద ఛాయలు

చెరగని ముద్ర 1
1/2

చెరగని ముద్ర

చెరగని ముద్ర 2
2/2

చెరగని ముద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement