
పిచ్చికుక్క స్వైర విహారం
బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కూలి పనులకు వెళ్లే కూలీని, బజారుకు వచ్చిన తండ్రికొడుకులను, స్వగ్రామానికి వెళ్లేందుకు వచ్చిన వృద్ధురాలిని, టిఫిన్ తెచ్చుకునేందుకు వచ్చిన వృద్ధుడిని, కూరగాయల కోసం వచ్చిన మహిళలను, ఇంటి పట్టున ఆడుకుంటున్న చిన్నారిని ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 గంటల వ్యవధిలో 45 మంది చిన్న, పెద్ద, వృద్ధులు, చిన్నారులు, మహిళలను కరిచి తీవ్రంగా గాయపరిచింది. చివరకు మున్సిపల్ సిబ్బంది వల పన్ని కుక్కను పట్టుకుని అంతమొందించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పురపాలకశాఖ మంత్రి నారాయణ, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఆరా తీశారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన, ఇతర ప్రాంతాల నుంచి పని నిమిత్తం పట్టణానికి వచ్చిన వృద్ధులు, చిన్నారులు, మహిళలు, యువకులను పిచ్చికుక్క తీవ్రంగా గాయపరిచింది. రోడ్లమీద, నడుచుకుంటూ, ద్విచక్ర వాహనాల్లో వెళుతున్న వారిని వెంటాడి మరీ గాయపరిచింది. దీంతో గంటపాటు సిద్దవటం రోడ్డులో ప్రజలు తిరిగేందుకు భయభ్రాంతులకు గురయ్యారు. అలాగే పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ పిల్లలను ఇళ్లల్లోనే ఉంచుకుని తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. 15 గంటల వ్యవధిలో సుమారు 45 మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రి పాలయ్యారు. బద్వేలు చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కుక్కకాటు బారిన పడటం మొదటిసారి కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
కిటకిటలాడిన ప్రభుత్వాసుపత్రి..
కుక్కకాటు బాధితులతో, వారి బంధువులతో ప్రభుత్వాసుపత్రి కిటకిటలాడింది. ఆదివారం రాత్రి నుంచి అర్థరాత్రి వరకు సుమారు 18 మంది కుక్కకాటుకు గురవ్వగా సోమవారం తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు 27 మంది కుక్కకాటుకు గురయ్యారు. కుక్కకాటు బాధితుల హాహాకారాలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. గాయపడిన వారిలో 6 మంది చిన్నారులు, 12 మంది వృద్ధులు, 27 మంది మధ్య వయస్కులు ఉన్నారు. వీరిలో మహాలక్షుమ్మ, దస్తగిరి, శ్రీను, నాగార్జున అనే వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ సుబ్బారెడ్డి, సిబ్బంది బాధితులకు ఏఆర్‌వీ ఇంజక్షన్లు అందించారు.
కుక్కను పట్టుకున్న సిబ్బంది..
పట్టణంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తున్న విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి కుక్కను పట్టుకునేందుకు దాదాపు 50 మంది సిబ్బందిని పురమాయించడంతో పాటు సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజలను జాగ్రత్తగా ఉండేలా సూచనలు అందించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన మున్సిపల్ సిబ్బంది ఎట్టకేలకు ఆర్టీసీ బస్టాండు వెనుక భాగంలో సంచరిస్తున్న పిచ్చికుక్కను పట్టుకుని అంతమొందించారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనపై ఆరా తీసిన మంత్రి, ఎమ్మెల్యే..
బద్వేలు పట్టణంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి 45 మందిని గాయపరిచిందని తెలుసుకున్న పురపాలకశాఖ మంత్రి నారాయణ, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఘటనపై ఆరా తీసి అధికారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా కుక్కను పట్టుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. అలాగే బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి, ప్రభుత్వాసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డిలతో మాట్లాడారు. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారికి క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు అందించాలని, వ్యాక్సిన్ల విషయంలో బాధితులు అశ్రద్ధ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వైద్యులు బాధితుల ఫోన్ నెంబర్లు తీసుకుని వారికి ఫోన్ చేసి మరీ అన్ని డోసుల వ్యాక్సిన్లు అందించాలని డిప్యూటీ సివిల్ సర్జన్‌కు సూచించారు. అలాగే ప్రజలపై దాడి చేసిన పిచ్చికుక్క ఇతర కుక్కలను కరిచి ఉంటే అవి కూడా పిచ్చికుక్కలుగా మారే అవకాశం ఉందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారించి జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.
15 గంటల వ్యవధిలో 45 మందిపై దాడి
కుక్కకాటు బాఽధితులతో కిటకిటలాడిన ప్రభుత్వాసుపత్రి
ఎట్టకేలకు కుక్కను పట్టుకుని చంపేసిన మున్సిపల్ సిబ్బంది
ఘటనపై ఆరా తీసిన పురపాలకశాఖ మంత్రి, బద్వేలు ఎమ్మెల్యే

పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం