
పాత కడప చెరువు వద్ద రగడ
టాస్క్‌ఫోర్సు: కడప నగర శివారులోని పాత కడప చెరువు వద్ద రగడ చోటుచేసుకుంది. కొంత మంది వ్యక్తులు టిప్పర్లతో రాత్రికి రాత్రే గ్రావెల్ తోలి చెరువు వద్ద చదును చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో పాత కడప రైతులు అక్కడికి వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ మట్టి తోలిస్తున్న వ్యక్తి.. ఇది తన పట్టా భూమి అని, ఇందులో గుంతలను చదువు చేసేందుకు మట్టి, గ్రావెల్‌ను తోలుకుంటున్నానని తెలిపాడు. దీంతో వారి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఇది చెరువు భూమేనని పాతకడప వాసులు, కాదు తన పట్టా భూమి అని వాళ్లు వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం పాత కడప రైతులు కడప తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన ఆర్‌ఐను పంపించి పరిశీలింపజేశారు. చెరువును ఆక్రమించే వ్యక్తి బయటి నుంచి గ్రావెల్‌తోపాటు చెరువులో జేసీబీ పెట్టి టిప్పర్‌లో అక్రమంగా భూమికి మట్టి తోలుతున్నట్లు గమనించి.. టిప్పర్‌తోపాటు జేసీబీని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. అయితే చెరువులో చదును చేస్తున్న భూమికి సంబంధించి పట్టా భూమి అని అది చెరువు భూమి కాదని తహసీల్దారు పాత కడప రైతులకు చెప్పినట్లు సమాచారం. ఈ స్థలాన్ని చదువు చేసే వ్యక్తి బయటి నుంచి గ్రావెల్‌తోపాటు చెరువు మట్టిని కూడా తోలడంతో జేసీబీతోపాటు టిప్పిర్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిసింది.
చెరువు వద్ద అభివృద్ధి పనులు చేయకూడదు
ఈ విషయమై పాత కడప రైతులు మాట్లాడుతూ పాతకడప చెరువు 460 ఎకరాలు ఉండేదని, ఇప్పటికే కొంతమేర ఆక్రమణకు గురైందని వాపోయారు. ఈ చెరువు కింద 3 వేల ఎకరాలకుపైగా సాగు భూమి ఉందని, ఇలా ఒక్కొక్కరు చెరువును ఆక్రమించుకుంటూ పోతే తమ కుటుంబాలు ఏ విధంగా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మట్టి తోలే భూమి కూడా చెరువు భూమేనని వారు ఆరోపించారు. ఒక వేళ అది పట్టా భూమి అయినా.. చెరువుకు 75 మీటర్ల దూరంలో ఎలాంటి అభివృద్ధి (ప్లాట్లు వేయడం) చేయకూడదనే నిబంధన ఉందన్నారు. దీంతోపాటు కేసీ కెనాల్‌కు 25 మీటర్ల పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయకూడదనే నిబంధన కూడా ఉందన్నారు. ప్రస్తుతం మట్టే తోలే ప్రదేశం చెరువుకు, కేసీ కాలువకు మధ్య ఉందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం కడప ఆర్‌డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చెరువును సర్వే చేసి భూమిని తేల్చే వరకు తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చెపడతామని వారు హెచ్చరించారు.
భూమి ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటున్న రైతులు
పట్టా భూమి అంటున్న ఓ వ్యక్తి
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం
అధికారుల దృష్టికి సమస్య

పాత కడప చెరువు వద్ద రగడ