సిబ్బంది కొరత.. వాహనదారులకు వెత
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడపలోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో వాహనదారులకు సేవలు కాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌ఎల్‌ఆర్ నుంచి వాహనాల బదిలీల వరకు అన్నీ జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో జరగాల్సి ఉంది. అయితే ఓవైపు ఉన్న సిబ్బంది తీరు, మరో వైపు సిబ్బంది కొరత వల్ల సేవలు కుంటుపడుతున్నాయి.
రెండు నెలలుగా ఇన్‌చార్జి పాలన..
ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో గత రెండు నెలల నుంచి రెగ్యులర్ రవాణాశాఖ అధికారి లేరు. దీంతో ఇన్‌చార్జి డీటీసీగా అన్నమయ్య జిల్లా డీటీసీ ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన అన్నమయ్య జిల్లాతో పాటు వైఎస్‌ఆర్ జిల్లాలో తమ సేవలను అందించాలంటే ఇబ్బందులు తప్పడం లేదు.
వేధిస్తున్న సిబ్బంది కొరత ..
రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధి స్తోంది. మొత్తం కార్యాలయంలో సిబ్బంది పది మంది ఉండాల్సి ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు. ఫలితంగా వాహనదారులకు సేవలు సకాలంలో అందడం లేదు. కడప రవాణా శాఖ కార్యాలయంలో ఇద్దరు ఎంవీఐలు ఉండాల్సి ఉండగా ఒక ఎంవీఐ సెలవులో వెళ్లడంతో ఉన్న ఒక ఎంవీఐనే దిక్కయ్యారు.
వాహనాల ఎఫ్‌సీలో దళారుల ఇష్టారాజ్యం..
వాహనాలకు ఎఫ్‌సీ చేయాలంటే దళారులను సంప్రదిస్తే సేవలు సులువుగా అందుతున్నాయి. ఎవరైనా ఎఫ్‌సీ నేరుగా చేయించుకుంటే వారికి ఎఫ్‌సీ అయి పోయినా పత్రాలు అందడం లేదు. కింది స్థాయి సిబ్బంది పెత్తనం చెలాయిస్తూ దండుకుంటున్నారు. వీటన్నింటికి కారణం రెగ్యులర్ అధికారి లేకపోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం కంటే మూడింతలు దళారులకు ఇస్తే వారు సకాలంలో పనులు చేయిస్తున్నారు. లేకుంటే రవాణా శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు.
రవాణా శాఖలో సకాలంలో
వాహనదారులకు అందని సేవలు
ఎఫ్‌సీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ వరకు తప్పని ఇబ్బందులు
రెండు నెలల నుంచి
రెగ్యులర్ అధికారి లేని వైనం
రవాణా శాఖలో వాహనదారులకు మెరుగైన సేవలు
రవాణాశాఖ తరఫున వాహనదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం. కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండటంతోనే సేవలు సకాలంలో అందడం లేదు. వాహనదారులకు వారి వాహనాలకు సంబంధించిన పత్రాలను సకాలంలో అందిస్తాం.
– ప్రసాద్, ఇన్‌చార్జి డీటీసీ.


