మతసామరస్యానికి ప్రతీక.. కమలాపురం ఉరుసు
కమలాపురం : ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. అన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కెల్లా ఒక విశిష్ట స్థానానికి నిలయమైన ఒకే ఒక ప్రదేశం వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం పెద్ద దర్గా.
కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా, జహీరియా మత సామరస్యానికి ప్రతీకగా, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ దర్గాలో హజరత్ అబ్దుల్ గఫార్‌షాఖాద్రి, హజరత్ దస్తగిరిషాఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి , హజరత్ జహీరుద్ధీన్ షాఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్లు వెలసి ఉన్నారు. ప్రతి ఏటా ఈ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వర్గీయ పీఠాధిపతి హజరత్ హాజి జహీరుద్ధీన్ షా ఖాద్రి ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహించేవారు. ఆయన పరమ పదించిన తర్వాత ఆయన వారసులు, ముతవల్లి సజ్జాదె–ఏ–నషీన్ హజరత్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, వారి సోదరుల ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దర్గా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 11వ తేదీన నషాన్‌తో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమై, 12న గంధం, 13న ఉరుసు, 14న తహలిల్‌తో కార్యక్రమాలు ముగుస్తాయి. ఉరుసు ఉత్సవాలకు దర్గా సుందరంగా ముస్తాబు అవుతోంది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. భక్తుల సౌకర్యార్థం ముతవల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
దర్గా విశిష్టత..
కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నుంచి మత ప్రబోధనలు చేస్తూ వచ్చిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి 1916లో కమలాపురం వచ్చి స్థిర పడ్డారు. ఆయన తన భక్తులకు బోధనలు చేస్తూ ఎన్నో మహిమలు చూపారు. దీంతో ఈ ప్రాంతంలో చాలా మంది ఆయనకు శిష్యులుగా మారారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణులై విరాజిల్లుతున్న గఫార్ షా ఖాద్రి తన ప్రియ శిష్యుడైన దస్తగిరిషా ఖాద్రికి గురుత్వం బోధించి 1924 జనవరి 10న సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దస్తగిర్‌షా ఖాద్రి వంశీయులే పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. దాదాపు 50ఏళ్లకు పైగా పీఠాధిపతిగా కొనసాగిన హజరత్ హాజీ జహీరుద్ధీన్ షా ఖాద్రి వలి అల్లాగా ప్రసిద్ధికెక్కారు. ఆయన ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన కుమారుడు ఫైజుల్ గఫార్‌షా ఖాద్రి గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మతసామరస్యానికి ప్రతీక
హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి దర్గాను హిందువులే నిర్మించడంతో ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హజరత్ దస్తగిర్‌షా ఖాద్రికి ముఖ్య శిష్యుడుగా ఉన్న నామా నాగయ్య శ్రేష్టి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు.
గొప్ప ఖవ్వాలి..
ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా ప్రాంగణంలో గంధం, ఉరుసు రెండు రోజుల పాటు గొప్ప ఖవ్వాలి పోటీ నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీకి చెందిన ఖుత్‌బీ బ్రదర్స్, యూపీకి చెందిన సర్ఫరాజ్ అన్వర్ సాబిరి ల మధ్య గొప్ప ఖవ్వాలి పోటీ జరుగుతుందని, ఖవ్వాలి ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
13న బండ లాగుడు పోటీలు..
కమలాపురం ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీన దర్గా ప్రాంగణంలో పాల దంతాలు కలిగిన వృషభ రాజములచే చిన్న బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు, నాల్గవ బహుమతి రూ.10వేలు ఇవ్వనున్నారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు 13వ తేదీ ఉదయం 7గంటల్లోపు దర్గా–ఏ–గఫారియా ఆఫీసులో లేదా 97011 23459, 81219 96786 నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
అన్నదానం..
ఉరుసు మహోత్సవాల్లో భాగంగా నషాన్ రోజున టి. హుసేన్ మియ్య, గంధం, ఉరుసు రోజుల్లో మోహన్ బీడి యజమాని కీ.శే. మహబూబ్ సాహెబ్ కుటుంబ సభ్యులు అన్నదానం చేయనున్నారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉరుసు మహోత్సవాలు
11న నషాన్, 12న గంధం, 13న ఉరుసు, 14న తహలిల్‌తో ముగింపు
మతసామరస్యానికి ప్రతీక.. కమలాపురం ఉరుసు
మతసామరస్యానికి ప్రతీక.. కమలాపురం ఉరుసు
మతసామరస్యానికి ప్రతీక.. కమలాపురం ఉరుసు


