పులివెందుల టౌన్: పులివెందులలోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీకి చంద్ర గ్రహణం పట్టుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) నిధులతో 12.86 ఎకరాలలో 12 రకాల క్రీడాంశాలకు సంబంధించి వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. 2023 జులైలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. హాకీ, ఆర్చరీ బ్లాక్‌లలో క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఎంతో ఉన్నతంగా క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రత్యేక చొరవ తీసుకుని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే అకాడమీలో క్రీడలకు మంగళం పాడారు. దాదాపు రూ.30 కోట్లతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం ప్రస్తుతం ఎందుకూ పనికిరాకుండా పోతోంది. క్రీడలను ప్రోత్సహించేందుకు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడటం లేదు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి 22 నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో వారు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. జీతాలు అందకపోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం క్రీడా ప్రాంగణంలో క్రీడలను ప్రోత్సహించి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు.
రూ.26.12 కోట్లతో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు
కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడే కరువు
22 నెలలుగా సిబ్బందికి అందని జీతాలు
అందుబాటులో అధునాతన భవనాలు
పులివెందులలో హాకీ క్రీడామైదానం క్రీడాకారులు రాణించేందుకు ఎంతో అనువుగా ఉంది. ఇక్కడ అధునాతన భవనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తే క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించవచ్చు. – శంకర్,
హాకీ అకాడమి హెడ్ కోచ్, అనంతపురం
అకాడమీని కొనసాగిస్తే ఎంతో మేలు
పులివెందులలో ఉన్న హాకీ అకాడమిని కొనసాగిస్తే ఎంతో మంది క్రీడాకారులు తయారవుతారు. హాకీ క్రీడామైదానం పులివెందులలో చాలా బాగుంది. ఇక్కడ ఆడుతుంటే బాగా క్రీడలో ప్రాక్టీస్ అవుతుంది. మా కోచ్ బాగా శిక్షణ ఇస్తున్నాడు. – షాలిని,
హాకీ క్రీడాకారిణి, ఆర్‌డీటీ, అనంతపురం
స్పోర్ట్స్ అకాడమీకి గ్రహణం