కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్దమైంది. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు ఇంటర్‌బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు తెలుగు, సంసృతం, హిందీ పేపర్లతో పరీక్షలు మొదలు కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 9 గంటలు దాటిని తరువాత ఒక్కరిని కూడా లోపలికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బంది కేంద్రంలోకి సెల్‌ఫోన్స్ తీసుకురాకూడదని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రం సమాచారం తెలిపేందుకు బటన్ ఫోన్‌ను అనుమతించారు. అది కూడా సమాచారం పంపగానే ఆఫీసు రూములో పెట్టాల్సి ఉంటుంది.
జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు...
జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 18, ఎయిడెడ్ కళాశాల ఒకటి, గురుకుల పాఠశాలలు 4, మోడల్ స్కూల్ ఒకటి, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 44, ఒక హైస్కూల్ ప్లస్‌ను సిద్దం చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 34,275 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 1205 మంది ఇన్విజిలేటర్లు, 69మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 69 మంది డిపార్టుమెంట్ అధికారులను నియమించారు. 23 మంది సెంటర్ కస్టోడియన్లు పరీక్షలను పర్యవేక్షించనున్నారు.ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
● పరీక్షలకు సంబంధించిన సామగ్రి ఇప్పటికే పోలీసు పహారాలో కేంద్రాలకు చేరింది.
● పరీక్షకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
● మెడికల్ సిబ్బందితో ప్రాథమిక చికిత్స సేవలు అందుబాటులో ఉన్నాయి.
● పరీక్ష కేంద్రాల్లో 1095 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
● బస్సు సౌకర్యం ఉన్న విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపించి ఉచితంగా బస్సు ప్రయాణం చేసేలా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇందుకోసం ఆర్టీసీ పలు రూట్లకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది.
● పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు.
● పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్, డిజిటల్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
జిల్లాలో 10 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో గండిలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల, దువ్వూరు, ముద్దనూరు, ఖాజీపేట, లింగాల, ఎర్రగుంట్ల, తొండూరు, సింహాద్రిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, బిమఠం ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల, కమలాపురం సొసియల్ వెల్ఫేర్ స్కూల్స్‌ను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు...
కడప ఆర్‌ఐవో కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే ఈ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన 08562– 244171 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సర్వం సిద్ధం చేసిన అధికారులు
నిఘానీడలో పరీక్షల నిర్వహణ
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశాం. అన్ని కేంద్రాల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాలను అమర్చాం. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల తనిఖీ కోసం ఫ్లయింగ్,సిట్టింగ్ స్వ్కాడ్‌లను నియమించాం. పరీక్షలకు సంబంధించి సెల్‌ఫోన్స్ దారా వచ్చే వదంతులను తల్లిదండ్రులు నమ్మవద్దు. –బండి వెంకటసుబ్బయ్య, ఆర్‌ఐవో, ఇంటర్ విద్య
ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ పరీక్షలను పారదర్శంగా నిర్వ హించేందుకు,విద్యార్థులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. సిబ్బంది సహకరించి పరీక్షలను పకబ్బందీగా నిర్వహించాలి.
– శ్రీనివాసులరెడ్డి, డీవీఈఓ, ఇంటర్ పరీక్షల స్పెషల్ ఆఫీసర్


