
ప్రమాదంలో దగ్ధమవుతున్న స్కూటీ
కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 16వ తేదీ శనివారం రాత్రి గానుగపెంట శంకర్ (28) అనే వ్యక్తిపై కట్టెలతో బాబ్జి, ఫైరోజ్, జమీల్ అలియాస్ డబ్బాలు దాడి చేశారు. గత ఏడాది శివరాత్రి రోజున శంకర్, బాబ్జి అనే ఇరువురు నిత్యపూజకోనకు వెళ్లారు. అక్కడ బాబ్జి ధూమపానం చేస్తుండగా శంకర్ మందలించి కొట్టాడు. వీరువురు గౌస్‌నగర్‌లో సాబాజ్ వద్ద పసుపు మండీలో హమాలిలుగా పనిచేస్తున్నారు. మనస్పర్థలు పెరగడంతో గత రాత్రి శంకర్‌పై దాడి చేయడంతో అతని తలకు గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శంకర్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కడప టూటౌన్ ఎస్‌ఐ జయరాముడు కేసు నమోదు చేశారు.
ఆటో బోల్తా
కాశినాయన : మండలంలోని నరసాపురం సమీపంలో ఆదివారం ఆటో బోల్తాపడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు నరసాపురం నుంచి ఆటోలో దాదాపు పది మంది పొలం పనులకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో నరసాపురం సమీపంలో ఆటో బోల్తాపడింది. నరసాపురం గ్రామానికి చెందిన వెంకటమ్మ, వంశీలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలైన వెంకటమ్మ, వంశీలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. కాశినాయన ఎస్‌ఐ అమరనాథ్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.
కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
వేముల : మండలంలోని వేముల సమీపంలో చెరువు కట్ట వద్ద ఆదివారం స్కూటీని కారు ఢీకొనడంతో శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందులకు చెందిన పూల శ్రీనివాసులు కడప రిమ్స్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విధులు పూర్తి చేసుకుని స్కూటీపై పులివెందులకు బయలు దేరాడు. వేముల సమీపంలోని చెరువు కట్ట వద్దకు రాగనే వేంపల్లె వైపు వస్తున్న కారు స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కాగా స్కూటీ పూర్తిగా కాలి పోయింది. గాయపడిన వ్యక్తిని పులివెందుల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఏఎంసీ మాజీ డైరెక్టర్
డాక్టర్ బి.వెస్లీ మృతి
మదనపల్లె : ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (ఏఎంసీ) మాజీ డైరెక్టర్ డాక్టర్ బోనం వెస్లీ (71) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఓ సమావేశంలో మాట్లాడుతున్న ఆయన ఉన్నట్లుండి హఠాత్తుగా కిందపడిపోయారు. కుటుంబీకులు ఆయనను ఆస్పత్రికి చేర్చేలోపు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

నరసాపురం వద్ద బోల్తాపడిన ఆటో