అట్లూరు : మండల పరిధిలోని లింగాలకుంట సమీపంలో కడప –బద్వేలు ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేలు పట్టణం శ్రీకృష్ణ దేవరాయ నగర్‌కు చెందిన షణ్ముఖ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు షణ్ముఖ కడప వైపు నుంచి బద్వేలుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. బద్వేలు డిపోకు చెందిన ఏపీ04జెడ్0066 నంబరు గల ఆర్టీసీ బస్సు కడపకు వెళుతూ లింగాలకుంట సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గాయపడిన యువకుడిని 108 వాహనంలో బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండడంతో కొంతమేర ప్రమాదం తప్పిందని లేకుంటే అక్కడే మృత్యువాత పడేవాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అట్లూరు : మండల పరిధిలోని జి.కొత్తపల్లె సమీపంలో 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ కె.సి.రాజు తెలిపారు. ఆయన వివరాల మేరకు జి.కొత్తపల్లె ఎస్టీకాలనీకి చెందిన ఉదయగిరి నిత్యపూజయ్య, సిద్దవటం మండలం పొన్నవోలు కొత్తపల్లె గ్రామానికి చెందిన పెరుగు లక్ష్మీనరసయ్యలు ఎర్రచందనం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. దాడి నిర్వహించి 5 దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.