ప్రాణం తీసిన పూచీకత్తు

నిందితుల అరెస్ట్‌ వివరాలను తెలియజేస్తున్న కడప డీఎస్పీ ఎండీ షరీఫ్‌ - Sakshi

కడప అర్బన్‌ : తన స్నేహితుడి అప్పు విషయంలో తాను పూచీ పడినందుకు నిందితుల చేతిలో చావుదెబ్బలు తిని శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. హత్య కేసుగా నమోదైన 24 గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటనపై ఆదివారం కడపలోని డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ ఎం.డి షరీఫ్‌ విలేకరులకు వివరాలను తెలియజేశారు.

కడప నగరం ఊటుకూరుకు చెందిన పాలెంపల్లి శ్రీకాంత్‌ రెడ్డి అక్కాయపల్లిలో నివాసం ఉంటున్నాడు. అతని స్నేహితుడు సత్యనారాయణ అలియాస్‌ సత్య ఈ కేసులో ప్రధాన నిందితులైన కడప నగరం శంకరాపురానికి చెందిన అండ్లూరు చైతన్యకుమార్‌ రెడ్డి, చిన్నచౌక్‌ ముత్తరాసపల్లికి చెందిన అవ్వారు లీల అలియాస్‌ శ్రీలీల ఒక్కొక్కరి వద్ద రూ. 10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తమ అప్పు తీర్చాలని పెద్దమనుషుల సమక్షంలో అడిగారు. ఆ సమయంలో సత్యనారాయణ స్నేహితుడైన శ్రీకాంత్‌రెడ్డి పూచీపడ్డాడు.

తర్వాత పలుకకపోవడంతో మే 31న నిందితులు, మూడో నిందితురాలైన కడప నాగరాజుపేటకు చెందిన, టిఫిన్‌ సెంటర్‌ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సత్యనారాయణ అక్క మద్దాల చాముండేశ్వరి ఇంటివద్దకు శ్రీకాంత్‌రెడ్డిని పిలిపించారు. అక్కడ నిర్బంధించి మిగిలిన నిందితుల సహకారంతో కొట్టారు. డబ్బులను కడితేనే వదిలిపెడతామన్నారు. అతన్ని ముత్తరాసపల్లిలోని లీల అలియాస్‌ శ్రీలీల ఇంటికి తీసుకెళ్లారు కట్టెలతో, క్రికెట్‌బ్యాట్‌తో కొట్టారు, కాళ్లతో తన్నారు. పాలెంపల్లి శ్రీకాంత్‌రెడ్డి స్పృహకోల్పోయి అక్కడికక్కడే చనిపోయాడు. తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని కాల్చి మాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే డ్రైవర్‌ లేకుండా సెల్ఫ్‌డ్రైవింగ్‌ చేసుకుంటామని ఇతియోస్‌ కారును బాడుగకు తీసుకున్నారు.

రెండు క్యాన్‌లలో 1200 రూపాయలకు పెట్రోల్‌ తీసుకున్నారు. శవాన్ని కారులో తీసుకెళ్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలేటిపల్లె పమీపంలో మూలవంకలో కంపచెట్లలో వేశారు. పెట్రోల్‌ పోసి తగులబెట్టేశారు. మరుసటి రోజున పశువుల కాపరుల సమాచారంతో మొదట గుర్తు తెలియని మృతదేహంగా భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాంత్‌రెడ్డి రెండురోజులుగా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతకొమ్మదిన్నె పరిధిలో లభ్యమైన మృతదేహాన్ని శ్రీకాంత్‌రెడ్డిదిగా గుర్తించారు. దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి హత్య కేసు నమోదైన 24 గంటల్లోనే నిందితులను కనుగొన్నారు. ఈనెల 3వ తేదీన మధ్యాహ్నం ఏడుగురు నిందితులను ఊటుకూరు సర్కిల్‌– రిమ్స్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డులోని పెద్దముసల్‌రెడ్డిపల్లి క్రాస్‌ రోడ్డు సమీపంలో అరెస్ట్‌ చేశారు.

వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కట్టెలు, క్రికెట్‌బ్యాట్‌, శవాన్ని కాల్చేందుకు తెచ్చిన పెట్రోలు క్యాన్‌లను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసులో అరెస్టయిన వారిలో ఫైనాన్స్‌ వ్యాపారి అండ్లూరు చైతన్యకుమార్‌రెడ్డి, ముత్తరాసపల్లికి చెందిన అవ్వారు లీల అలియాస్‌ శ్రీలీల, నాగరాజుపేటకు చెందిన మద్దాల చాముండేశ్వరి, చింతకొమ్మదిన్నె మండలం, నరసరామయ్యగారిపల్లికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి సోమశివ ప్రశాంత్‌ యాదవ్‌ అలియాస్‌ ప్రశాంత్‌, పాతకడప మామిడివీధికి చెందిన జకట ఉదయ్‌కిరణ్‌, శంకరాపురానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్ధి సింగనమల వెంకటసాయి, శ్రీలీల భర్త కాకి మెహన చంద్ర ఉన్నారు.

వీరిని 24 గంటల్లోనే అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన కడప రూరల్‌ సీఐ కె. అశోక్‌రెడ్డి, చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ భూమా అరుణ్‌రెడ్డి, ఎస్‌బి ఎస్‌ఐ నర్రెడ్డి రాజరాజేశ్వరరెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు విద్యాసాగర్‌, విశ్వనాథరెడ్డి, లక్షుమయ్య, కానిస్టేబుళ్లు జనార్దన్‌రెడ్డి, విజయ్‌, అశోక్‌, సాయికుమార్‌, సి. సుధాకర్‌యాదవ్‌, హోంగార్డు లక్ష్మీరెడ్డి, అనిత, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్‌ అభినందించారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top