
ఎరుపెక్కిన ‘పసుపు’
కడప రూరల్: మాటల మంటలతో కడప టీడీపీ ఎరుపెక్కింది. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో రోజుకో వేడి రాజుకుంటోంది. మహానాడు నేపధ్యంలో కడపలో గురువారం మినీ మహనాడును ఏ ఘడియలో నిర్వహించారో గానీ.. అప్పటి నుంచి పార్టీ నేతల మధ్య బహిరంగంగానే ఆరోపణల సమరం సాగుతోంది. మినీ మహానాడులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఆ పార్టీకే చెందిన సీనియన్ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన పార్టీకి ద్రోహం చేశారని ఒక వాయిస్ రికార్డ్‌ను వినిపించారు. దీనిపై మండిపడిన లక్ష్మీరెడ్డి తప్పని పరిస్థితుల్లోనే మీడియా ముందుకు వచ్చానని చెపుతూ, శ్రీనివాసులురెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ఈ అంశాలు ఆ పార్టీతో పాటుప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
తమ్ముళ్ల ఎదురుదాడి...
లక్ష్మీరెడ్డి ఆరోపణలకు శ్రీనివాసులురెడ్డితో పాటు అనుచరులకు ఆగ్రహం తెప్పించినట్లైంది. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి నివాసంలో కడప నగర నాయకుల మీడియా సమావేశం ఉందని సమాచారం ఇచ్చారు. తరువాత ఈ సమావేశం వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌కు మారింది. కేవలం లక్ష్మీరెడ్డి అంశానికి సంబంధించే వరుసగా మూడు మీడియా సమావేశాలు జరిగాయి. తొలుత నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆ పార్టీ కడప నగర ఉపాధ్యక్షులు మన్సూర్ అలీఖాన్, జిలానీ బాషా, హుస్సేన్ ఖాజాపీర్, రెండవ సమావేశంలో పాలంపల్లె రాజువెంకటసుబ్బారెడ్డి, పీ రాజా, శివారెడ్డి, పాత కడప కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, సాయంత్రం నిర్వహించిన మూడవ ప్రెస్‌మీట్‌కు 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి ,25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణతో పాటు బాలక్రిష్ణారెడ్డి, చల్లా రాజశేఖర్ మణికంఠారెడ్డి, నాగేంద్రనాయుడు పాల్గొన్నారు. అలాగే హరి టవర్స్‌లో గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్ కూడా మీడియా సమావేశం నిర్వహించారు.
చిత్త శుద్ధి..విశ్వసనీయత లేదంటూ..
మీడియాతో తమ్ముళ్లు అంతా దాదాపుగా ఒకే అంశంపై మాట్లాడారు. లక్ష్మీరెడ్డిపై మాటల యుద్ధం చేశారు. లక్ష్మీరెడ్డి పార్టీలో చాలా సీనియర్ నేత ‘పెద్దాయన’అంటూనే ఎదురుదాడి చేశారు. ఆయనకు చిత్త శుద్ధి లేదంటూ ఆరోపణలు గుప్పించారు.ఎమ్మెల్యే సీటును లక్ష్మీరెడ్డి కుటుంబానికి ఇస్తామని చెప్పింది వాస్తవమే. అయితే అధిష్టానం మాధవిరెడ్డికి ఇచ్చింది. ఎమ్మెల్యే సీటును ఒకరికే ఇస్తారు సర్దుకు పోవాలని వ్యాఖ్యానించారు.
కాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కీలకమైన స్ధానంలో ఉన్న శ్రీనివాసులురెడ్డికి చిత్త శుద్ధి ఉందా..ఉంటే ఆయన కూడా తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి కదా..? అని ఆ పార్టీకే చెందిన కొందరు కార్యకర్తలు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
సీనియర్ నేత లక్ష్మీరెడ్డిపై ‘తమ్ముళ్ల’ మాటల దాడి
ఢీ అంటే ఢీ అంటున్న పచ్చ నేతలు!