●రికార్డులేకున్నా రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

●రికార్డులేకున్నా రిజిస్ట్రేషన్‌

May 23 2025 2:15 AM | Updated on May 23 2025 2:15 AM

●రికా

●రికార్డులేకున్నా రిజిస్ట్రేషన్‌

సాక్షి ప్రతినిధి, కడప: జీవితంలో సొంతిళ్లు ప్రతి ఒక్కరి కల. ఆ కలలను నెరవేర్చుకునేందుకు 35ఏళ్లుగా టీచర్లు ఎదురుచూస్తున్నారు. ఎదుగుబొదుగు లేని ప్ల్లాట్స్‌ డెవలప్‌మెంట్‌ చేసుకోవాలనే దిశగా సంఘటితమయ్యారు. హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ద్వారా సంక్రమించిన ప్లాట్‌లో ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్న సమయంలో ఒక్కసారిగా టీడీపీ గద్దలు వాలిపోయాయి. బెదిరించి స్వాహా చేయాలనే దిశగా అడుగులు వేశాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తూ హద్దులు, కేటాయింపు రాళ్లు నామరూపాలు లేకుండా చేశారు. మహానాడు తర్వాత యథావిధిగా హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకీ అప్పగిస్తారా? ముప్పు తిప్పలు పెడతారా? అన్న సందిగ్ధంలో అయ్యవార్లు ఉండిపోయారు.

● 1989లో టీచర్స్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ 88 ఎకరాలు కడప రూరల్‌ పబ్బాపురం గ్రామ పరిధిలో కొనుగోలు చేసింది. అందులో 1430 మంది ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పట్లో ఆ భూ మి వైపు ఎవరూ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు, కాలక్రమేపి రింగ్‌రోడ్డు అందుబాటులోకి రావడం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు 17 ఏళ్లు తర్వాత 2006లో తమ సమ్మతి లేకుండా కొనుగోలు చేశారని శోత్రియందారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు మరో పదేళ్లు తర్వాత తీర్పు వెలుబడింది. టీచర్స్‌ అప్పీల్‌కు వెళ్లిన పిదప 1/3 వంతు శోత్రియం హక్కుదారులకు ఇవ్వాలని ఆదేశించింది. కేవలం 20 ఎకరాలకు మాత్రమే శోత్రియందారుల ప్రమేయం లేకుండా కొనుగోలు చేశారని, అందులో 1/3 వంతు ఇవ్వాల్సి ఉంటుందని టీచర్లు వివరిస్తున్నారు. ఈలెక్కన దాదాపు 6.66 ఎకరాలు మాత్రమే అప్పజెప్పాల్సి ఉంటుంది. అది అలా ఉండగా 2021లో శుభకీర్తి డెవలపర్స్‌ పేరిట 20 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేయడంపై వివాదం తెరపైకి వచ్చింది.

35ఏళ్లుగా నిరీక్షణ

35ఏళ్లుగా ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయిన ప్ల్లాట్స్‌

టీచర్స్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో మహానాడు నిర్వహణ

ప్రస్తుతం ప్లాట్స్‌ చదును చేసిన తెలుగుదేశం పార్టీ

యథావిధిగా స్థలాలు దక్కుతాయా? హైరానాలో అయ్యవార్లు

పబ్బాపురం టీచర్స్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ పరిధిలో 20 ఎకరాలకు రైత్వారీ పట్టా ఒకటి వెలుగులోకి తెచ్చారు. ఆ రైత్వారీ పట్టాకు చెందిన భూమి వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో లేదు. అయినప్పటికీ రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం శుభకీర్తి డెవెలపర్స్‌ పేరిటి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈమొత్తం వ్యవహారాన్ని హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ వెలుగులోకి తెచ్చింది. అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌ జిల్లా రిజిస్ట్రార్‌, చింతకొమ్మదిన్నె తహసీల్దార్‌, టీచర్లతో కలిపి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తే 2021లో రైత్వారీ పట్టా కేటాయింపుకు చెందిన ఎలాంటి రికార్డులు అందుబాటులో లేవని స్పష్టమైంది. నకిలీ రైత్వారీ పట్టా పుట్టించినట్లు తేటతెల్లమైంది. వెబ్‌ల్యాండ్‌లో లేకపోయినా శుభకీర్తి డెవెలపర్స్‌కు రిజిస్ట్రేషన్‌ కావడం గమనార్హం. కాగా ఈ శుభకీర్తి డెవెలపర్స్‌ మైదుకూరు టీడీపీ నేత సూట్‌కేసు కంపెనీగా గుర్తించారు. ఆపై ఉపాధ్యాయ దినోత్సవం రోజున హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేయగా, గుర్తుతెలియని వ్యక్తులు అప్పట్లో కార్యాలయంపై దాడి చేశారు.

టీచర్స్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ కొనుగోలు చేసిన భూమిని చేజిక్కించుకోవాలని కొందరు అక్రమార్కులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇది వరకూ అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి అయ్యవార్లు తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించినా టీచర్ల్లకు 35ఏళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు. తాజాగా ఆవే స్థలాలపై మహానాడు నిర్వహిస్తుండడంతో టీచర్లు పిడుగు పడ్డట్లుగా భావిస్తున్నారు. గౌరవంగా టీచర్లు ప్లాట్లు అప్పగిస్తారా? ముప్పుతిప్పలు పెట్టి వేధిస్తారా? అనే భావన అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు సొంత డబ్బుతో కొనుగోలు చేసిన స్థలాన్ని ఇప్పటికీ దక్కించుకోలేని దుస్థితి ఉంది. తెలుగుతమ్ముళ్లకు చిత్తశుద్ధి ఉంటే వివాదాలు పరిష్కరించి, టీచర్లును మద్దతుగా నిలవాల్సి ఉంది. ఇదివరకే మైదుకూరు టీడీపీ నేత బినామీ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ఎత్తుగడ నేపధ్యంలో, ఉపాధ్యాయులు లోలోన మదనపడిపోతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డిలు బాధ్యతగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. టీచర్ల స్థలాల్లో మహానాడు నిర్వహించిన తర్వాత అంతే బాధ్యతగా న్యాయం చేసేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ఏమేరకు బాధ్యత తీసుకుంటారో వేచిచూడాల్సిందే!

●రికార్డులేకున్నా రిజిస్ట్రేషన్‌1
1/2

●రికార్డులేకున్నా రిజిస్ట్రేషన్‌

●రికార్డులేకున్నా రిజిస్ట్రేషన్‌2
2/2

●రికార్డులేకున్నా రిజిస్ట్రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement