
శ్రీధర్, సునీల్.. సోదరులిద్దరికీ క్రికెట్‌పై ప్రేముంది.. అంతకు మించి ప్రతిభా ఉంది. అంతేనా.. నాన్న పంచిన ప్రతి రక్తపు బొట్టులోనూ ‘ఆట’ దాగుంది. మంచి క్రికెటర్లుగా పేరుంది. ఇదే కోచింగ్ అకాడమీకి నాంది పలికింది. ఇది ఏటా వందలాది మంది నెపుణ్యం కలిగిన క్రికెటర్లను సమాజానికి అందించే వేదికైంది.
(సాక్షి, కడప డెస్క్)
వాల్మీకిపురంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన గుండ్లూరు చంద్రశేఖర్, సుబ్బలక్ష్మి దంపతుల సంతానం శ్రీధర్ కుమార్, సునీల్ కుమార్. చంద్రశేఖర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సుబ్బలక్ష్మి గృహిణి. చంద్రశేఖర్ నేషనల్ టెన్నికాయిట్ చాంపియన్. క్రికెటర్ కూడా. దంపతులిరువురూ తమ కుమారులను గొప్ప క్రికెట్ ఆటగాళ్లుగా చేయాలని తపించారు. ఆ మేరకు అన్ని రకాలుగా ప్రోత్సహించారు. శ్రీధర్, సునీల్‌లు పలు విభాగాల్లో మంచి క్రికెటర్లుగా రాణించారు. అనంతరం వాల్మీకిపురం క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేశారు. అక్కడే కోచింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను సాన పడుతున్నారు.
ప్రతిభామూర్తులు..
క్రికెట్ కోచింగ్ కేంద్రాన్ని స్థాపించిన సోదరులు శ్రీధర్, సునీల్‌లు మంచి ఆల్‌రౌండర్లు. గతంలో వివిధ స్థాయి క్రికెట్ పోటీల్లో రాణించారు. శ్రీధర్ యూనివర్సిటీ, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో రాణించి ప్రశంసలు పొందారు. బీఎస్పీ, బీఈడీ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం పెద్దమండ్యం మండలం కలిచెర్ల జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సునీల్ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో రాణించి క్రికెటర్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన ఈయన బీసీసీఐ లెవల్–1 కోచ్‌గా ఎంపికయ్యారు. 2012 నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఉద్యోగిగా కొనసాగుతూ మదనపల్లె డివిజన్ క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
20 ఏళ్లుగా ..
వాల్మీకిపురం వద్ద నెలకొల్పిన క్రికెట్ కోచింగ్ సెంటర్ ద్వారా 20 ఏళ్లుగా వందలాది మందికి శిక్షణ ఇచ్చారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. ఈ క్యాంప్‌నకు 100 మంది వరకు వచ్చి శిక్షణ పొందుతారు.
ఎంఎస్‌కే చొరవతో..
ఇక్కడ నిర్వహిస్తున్న క్రికెట్ కోచింగ్ కేంద్రాన్ని 2011లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్, ఏసీఏ డైరెక్టర్ అయిన ఎంఎస్‌కే ప్రసాద్ సందర్శించారు. ఉచిత శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. క్రికెట్‌లో కొన్ని మెళకువలు తెలియజేశారు. సునీల్, శ్రీధర్‌లు చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం 2012లో ఈ కేంద్రానికి ఒక క్రికెట్ కోచింగ్ సబ్‌సెంటర్‌ను మంజూరు చేయించారు. ఒక మారు మూల ప్రాంతానికి కోచింగ్ సెంటర్ మంజూరు కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
తల్లిదండ్రుల స్ఫూర్తితో..
శ్రీధర్, సునీల్‌ల తల్లి సుబ్బలక్ష్మి 2006లో, తండ్రి చంద్రశేఖర్ 2017లో మృతి చెందారు. వారి స్ఫూర్తి, జ్ఞాపకార్థం ఈ సోదరులిద్దరూ తమ స్వంత నిధులతో 11 ఎకరాలను కొని అందులో ఆరు ఎకరాలను క్రికెట్ మైదానంగా మార్చారు. 2020లో గుండ్లూరు వెంకట సుబ్బలక్ష్మి, చంద్రశేఖర్ (జీవీఎస్‌సీఎస్)ల పేరిట క్రికెట్ గ్రౌండ్ ప్రారంభించారు.
రాష్ట్రస్థాయిలో..
ఇక్కడ శిక్షణ పొందినవారిలో ఐదుగురు రాష్ట్రసాయి అండర్–19, అండర్–16, అండర్–14 క్రికెట్ విభాగాల్లో ఎంపికయ్యారు. సౌత్‌జోన్ స్థాయిలో ముగ్గురు, యూనివర్సిటీ స్థాయిలో 30 మంది, జిల్లాస్థాయి పోటీలకు 150 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. వీరంతా ఆయా స్థాయిల్లో జరిగిన వివిధ రకాల క్రికెట్ పోటీల్లో రాణించారు. క్రికెట్ సబ్ సెంటర్‌లో శిక్షణ పొంది రాణించిన ఎంతో మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కూడా ఉన్నారు.
ప్రతిభకు పదును
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ఆడాలనేదే నా లక్ష్యం. 2022లో అండర్–16 ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టుకు ఎంపికై మంచి ప్రతిభ కనబరిచాను. అండర్–19 సౌత్‌జోన్ జట్టుకు ఎంపికై రాణించాను. లెఫ్ట్‌హ్యాండ్ మీడియం పేసర్‌గా రాణించాలని ఉంది. ఇక్కడ నా ప్రతిభకు పదును పెడుతున్నారు.
– రుక్సార్ తబస్సుమ్, పుంగనూరు
జాతీయస్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దుతాం
గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయస్థాయికి క్రీడాకారులు ఎదిగేలా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఇందుకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నాం. మెళకువలు నేర్పించి వారి ప్రతిభకు పదును పెడుతున్నాం. వేసవి శిక్షణా శిబిరాలు, జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మాపై మరింత బాధ్యతను పెంచాయి. మా కోచింగ్ సెంటర్‌లో చిన్నపిల్లల నుంచి సీనియర్ క్రీడాకారుల వరకు నిరంతరం శిక్షణ తీసుకొంటున్నారు. అన్నమయ్య జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు.
– శ్రీధర్ కుమార్, సునీల్ కుమార్
మంచి స్పిన్నర్ అవుతా
స్పిన్ బౌలర్‌గా రాణించడమే నా ధ్యేయం. గతంలో అండర్–14 రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యాను. అండర్–16, 19 రాష్ట్ర ప్రాబబుల్స్‌లో రాణించా. అండర్–19 సౌత్‌జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికై గుర్తింపు తెచ్చుకున్నాను. ఎస్వీయూ క్రికెట్ జట్టు తరఫున సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొని సత్తా చాటా. మంచి స్పిన్నర్‌గా రాణించడమే లక్ష్యంగా ఇక్కడ శిక్షణ తీసుకొంటున్నా.
– దీపన్ సాయి, వాల్మీకిపురం
ఓపెనర్‌గా రాణిస్తా
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ఓపెనర్‌గా రాణించాలని ఉంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో తొమ్మిదేళ్లుగా ఆడుతున్నాను. ఎస్వీ యూనివర్సిటీ తరఫున ప్రస్తుతం సౌత్‌జోన్ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నా. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలనే తపనతో ఇక్కడ శిక్షణ పొందుతున్నా. కోచింగ్ చాలా బావుంది.
– అకీబ్, గుర్రంకొండ