
ఆర్‌పీఎఫ్ సీఐ శ్రీనివాసులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రయాణిస్తున్న రైళ్లపై ఎవరైనా రాళ్లు విసిరితే ఐదేళ్ల జైలు శిక్ష పడుతుందని కడప రైల్వే ఆర్‌పీఎఫ్ సీఐ ఎం.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో రైలు ప్రయాణించే సమయంలో దుండగులు, ఆకతాయిలు రాళ్లు విసురుతున్న సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో ప్రయాణికులు కొంతమంది గాయాల పాలవుతున్నారన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తే సెక్షన్ 153 ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష పడుతుందన్నారు. చట్టాన్ని అతిక్రమించే ఆకతాయిలు, దుండగులు, సంఘ విద్రోహశక్తులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
నల్లగంగమ్మ ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు
సంబేపల్లె : అన్నమయ్య జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ ఆలయంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ చైర్మన్ మునగమురళీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ. 1,96,439 ఆదాయం లభించిందని తెలిపారు.
హత్యకేసులో నిందితుల అరెస్టు
సుండుపల్లె (వీరబల్లి) : సుండుపల్లె మండలంలోని చిన్నగొల్లపల్లి పంచాయతీ, కొత్తజంగంపల్లిలో ఈనెల 14న జరిగన దాడిలో గాయపడిన మునీంద్ర ఈనెల 24వ తేదీ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను రాయచోటి గ్రామీణ సీఐ లింగప్ప ఆధ్వర్యంలో మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నాడన్నారు. నిందితులు ఆంజనేయులు, సూర్యప్రకాష్ ను రాయచోటి కోర్టులో , మైనర్‌ను కడపలో హాజరు పరిచామని తెలిపారు.
పాము కాటుతో వ్యక్తి మృతి
పెనగలూరు : మండల కేంద్రమైన పెనగలూరు పంచాయతీ, ఇండ్లూరు గ్రామానికి చెందిన ఇప్పగుంట రామిరెడ్డి (57) మంగళవారం రాత్రి పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్‌ఐ హేమాద్రి తెలిపారు. వివరాలు..తన పొలంలో సాగుచేసిన జొన్న పంటకు నీరు వేసేందుకు పొలానికి వెళ్లాడు.రాత్రి 11గంటలకు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పాము కాటు వేసింది. సమాచారాన్ని బంధువులకు తెలిపాడు. వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
వేర్వురు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె (అన్నమయ్య జిల్లా) : వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మదనలపల్లెలోని ప్యారానగర్‌కు చెందిన జిలానీ భార్య రేష్మా(35) కుటుంబ గొడవలతో మనస్తాపం చెంది బుధవారం నిద్రమాత్రలు మింగింది. రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన సోమశేఖర్ భార్య శ్రావణి(20) ఇంటిలోని వేధింపులు భరించలేక గుళిక మందు తినింది. కుటుంబసభ్యులు బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
తల్లీ కొడుకుపై దాడి
మదనపల్లె (అన్నమయ్య జిల్లా) : ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదంతో కొందరు వ్యక్తులు తల్లీకొడుకుపై దాడిచేసిన సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలుకు చెందిన అమరేంద్ర(43) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన బోడెన్న తన గురించి ఇతరులకు చెడుగా చెపుతున్నారని భావించి అమరేంద్రపై కుటుంబసభ్యులతో కలిసి దాడిచేశాడు. కుమారుడిని రక్షించేందుకు అడ్డుగా వచ్చిన అమరేంద్ర తల్లి రమణమ్మ(66)పై కూడా దాడిచేశారు. దాడిలో తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంటివద్ద చెత్తచెదారం పడి అపరిశుభ్రంగా ఉందని వేరే వాళ్లకు చెబుతుండగా, తన గురించే చెపుతున్నాడని, అనుమానం పెట్టుకున్న బోడెన్న కుటుంబసభ్యులతో కలిసి తనపై దాడిచేసినట్లు బాధితుడు చెప్పాడు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.