భక్తాగ్రేసరుడు.. రామదాసుడు!

ఓబులదాసు (నమునాచిత్రం)  - Sakshi

మాల ఓబన్న (భవనాసి ఓబులదాసు) ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. రామభక్తుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. రామయ్యపై పాటలు పాడిన కారణంగా నాడు తీవ్ర వివక్షకు గురయ్యాడు. తన భక్తునికి జరిగిన అవమానంతో ఖిన్నుడైన స్వామి గర్భగుడిలో తన దిక్కును మార్చుకున్నాడని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఓబులదాసు శ్రీరాముడి అపరభక్తునిగా నిలిచిపోయాడు.

రాజంపేట: ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి తూర్పు వైపున మాల ఓబన్న మంటపం కనిపిస్తుంది. ఇది రామ భక్తుడు భవనాసి ఓబులదాసు మంటపం. ఈయన వైష్ణవభక్తుడు. భవనాశి ఓబన్న ఆయన పూర్తిపేరు. నిత్యం ఈ గుడి సమీపంలో ఉంటూ స్వామి భజనలు చేసేవాడు. అంటరానివాడు..దూరంగా నెట్టండి అని ఒక అధికారి ఓబన్నను ఆలయం పడమర వైపునకు నెట్టించాడు. ఓబన్న అక్కడున్న మంటపంలో నిలబడి పాటలు పాడుతూనే ఉన్నాడు. ఆ రాత్రి అలాగే సాగింది. ఉదయం అర్చకులు ఆలయ తలుపులు తెరవగా సీతారామలక్ష్మణ విగ్రహాలు పడమర వైపునకు తిరిగి ఉండటాన్ని గమనించాడు. తన భక్తుడైన ఓబన్నను అవమానించారనే కారణంగా స్వామి ఇలా తన దిక్కును మార్చుకున్నాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

అక్కడ రామదాసు..ఇక్కడ ఓబులదాసు.

తెలంగాణలోని భద్రాద్రి రామయ్యకు అపరభక్తునిగా రామదాసు చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే ఒంటిమిట్ట రామయ్య భక్తుడిగా ఓబులదాసు కూడా చరిత్రలో నిలిచిపోయినప్పటికి ఆయనకు తగినంత ప్రాచుర్యం లభించలేదు. ఓబులదాసు రామయ్యపై కీర్తనలు ఆలపించాడని.. అయితే వాటిని రాతరూపంలో భద్రపరిచి ఉంటే ఈరోజు మరో అన్నమాచార్యునిగా ప్రసిద్ధికెక్కేవాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఓబన్న

పుట్టుపుర్వోత్తరాలు..

ఒంటిమిట్టకు క్రోసుడు దూరంలో మలకాటిపల్లె హరిజన కుటుంబంలో భవనాసి ఓబులదాసు(మాలఓబన్న) జన్మించాడు. వావిలికొలను సుబ్బారావు కన్నా ముందుగా రామభక్తుల వరుసలో ముందున్నాడు. ప్రతి నిత్యం పాటలు పాడుకుంటూ రాముని కై ంకర్యంలో జీవించాడు. ఈయన గురించి తిరుమల తిరుపతి దేవస్ధానం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కాగా బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున హారతి, బియ్యం, పసుపు, కుంకుమ వంటి పూజా సామగ్రి తమ వంశంవారి నుంచి స్వీకరించాలని ఓబన్న కోరినట్లు తెలుస్తోంది.

అవమానించిన అధికారికి కలలో..

ఓబన్నను అవమానించిన ఆ అధికారికి కలలో కోదండరామస్వామి కనిపించి మందలించాడు. ఉదయాన్నే అధికారి ఓబన్నను వేడుకొంటూ గుడి వద్దకు వచ్చాడు. స్వామి తూర్పు వైపు తిరిగి కనిపించాడు.

గరుడోత్సవం రోజున..

బ్రహ్మోత్సవాల సమయంలో గరుడోత్సవం నాడు స్వామి ఊరేగింపు బయటకు వచ్చినప్పుడు ఓబన్న స్వామికి హారతి పట్టడం నేటికి సంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది.

ఓబన్న వంశీకులకు గౌరవమేదీ..

ఓబన్న వారసుల విషయంలో దేవదాయశాఖ గతంలోనూ, ఇప్పుడు టీటీడీ అదే తీరును అవలంబిస్తోందని దళితసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వావిలికొలను సుబ్బారావు చరిత్ర తరహాలో ఓబులదాసు చరిత్రను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

పూర్వం నుంచి..

పూర్వం నుంచి ఆలయ నిర్వాహకులు ఓబన్న వంశీకులకు టెంకాయ, ఐదుపావుల బియ్యం, పూలదండ, కేజీనూనె ఇచ్చేవారు. గత కొంతకాలంగా రూ.3వేలు నగదు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

కల్యాణ వేదికపై ఓబన్న వారసులకు స్థానమేదీ?

కల్యాణ వేదికపై అన్నమయ్య వారసులను గౌరవించే తరహాలో ఓబన్న వారసులకు టీటీడీ నుంచి పిలుపులేదు. ఈ సారి స్వామివారి కల్యాణంలో మాలఓబన్న వంశస్తులకు పెద్దలతో పాటు స్థానం కల్పించాలనే డిమాండ్‌ దళిత నేతల నుంచి వినిపిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలన్న భావన వారిలో కనిపిస్తోంది.

సీతా,రామ,లక్ష్మణ మూలవిరాట్టు

రామాలయం ఎదురుగా ఉన్న మాలఓబన్న మంటపం

వావిలికొలను కన్నా ముందే రామభక్తుడు ఓబులదాసు

ఓబన్న కీర్తనలవైపే ‘రామయ్య’చూపు!

గరుడోత్సవంలో ఓబన్నకు హారతి

వారసులకు లభించని గౌరవం

ఓబులదాసు వారసులుగా జన్మించడం పూర్వజన్మ సుకృతం

ఓబులదాసు వారసులుగా జన్మించడం పూర్వజన్మ సుకృతం. తరతరాలుగా రామయ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం గాలిగోపురం (తూర్పు) ఎదుట పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను కొనసాగిస్తున్నాం. మమ్మల్ని వారసులుగా గుర్తించి స్వామి వారి కల్యాణ వేదికపై అవకాశం కల్పించాలి. –భవనాసి కాటయ్య, ఓబన్న వారసుడు

ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలి

రామదాసు తరహాలోనే ఓబులదాసు కూడా అపర రామభక్తుడు. అలాంటి భక్తునికి గుర్తింపు, ప్రాచుర్యం కల్పించడంలేదు. కనీసం విగ్రహమైనా ఏర్పాటు చేయాలి.

–భవనాసి సుబ్బన్న, ఓబన్న వారసుడు

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top