
ఓ మహిళతో రెడ్డప్ప వివాహేతర సంబంధం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం నగరిగుట్ట ఎస్సీ కాలనీ సమీపంలోని ఓ ఇంటిలో సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల పట్టణం ఎర్రగుడిపల్లెకు చెందిన నాగరాజు, శివమ్మల కుమార్తె భారతిని రెండేళ్ల క్రితం శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లె మండలం రామాపురం గ్రామానికి చెందిన రెడ్డప్ప(22)తో వివాహం చేశారు.
వీరి కాపురం ఏడాది పాటు సంతోషంగా సాగింది. తర్వాత పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన ఓ మహిళతో రెడ్డప్ప వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెడ్డప్ప లారీ డ్రైవర్‌గా పని చేస్తూ అక్కడికి, ఇక్కడికి వచ్చి వెళ్లే వాడని భార్య భారతి బంధువులు ఆరోపించారు. ఆరు నెల క్రితం పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో అధికారులు, పెద్ద మనుషుల సమక్షంలో ప్రియురాలి ఇంటికి వెళ్లకుండా ఉండాలని తీర్మానం చేశారు.
అయినా రెడ్డప్ప తన ప్రేమ వ్యవహారాన్ని నడుపుతూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రియురాలు ఇంట్లో రెడ్డప్ప చనిపోయాడు. ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రియురాలు, వారి బంధువులు చెబుతున్నారు. భార్య భారతి, బంధువులు మాత్రం రెడ్డప్పను ప్రియురాలు, వారి బంధువులే చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త మృతి చెందడంతో ఆసుపత్రిలో భార్య భారతి, వారి బంధువుల రోదనలు మిన్నంటాయి. బాధితురాలు భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.