ఆస్తి కోసం ఆత్మీయుల అంతం | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం ఆత్మీయుల అంతం

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

నాగార్జునసాగర్‌ : ఒకప్పుడు రక్త సంబంధం అంటే ఆప్యాయత, అనురాగం, అండగా నిలిచే బంధం. ప్రస్తుత సమాజంలో అదే బంధాలు ఆస్తి, స్వార్థం, అనుమానాల మధ్య నరమేధాలకు దారి తీస్తున్నాయి. ఆస్తి వివాదాలు, స్వార్థపూరిత ఆలోచనలు మనుషులను ఎంత క్రూరంగా మార్చుతున్నాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఆస్తి ముందు రక్త సంబంధం వెలవెలబోయింది. రక్త సంబంధాలు కాస్త కాటేసే రాక్షసాలుగా మారాయి. నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఘాతుకం మానవత్వానికే మచ్చ తెచ్చింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో రక్త సంబంధాన్ని మర్చిపోయి తల్లి, కూతురిని అత్యంత క్రూరంగా హతమార్చారు.

ఆస్తి తగాదాలే హత్యకు కారణం..

ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన రుద్రాక్ష సుమలత, ఆమె కుమార్తె రుద్రాక్ష లావణ్య ఆదివారం ఉదయం ఆయిల్‌పామ్‌ తోటకు వెళ్లారు. కొద్దిసేపటికే అనుమానాస్పద స్థితిలో మృతదేహాలుగా కనిపించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బంధువులే కళ్లల్లో కారం చల్లి, చీరకొంగు, చున్నీతో ఊపిరాడకుండా చేసి తల్లీ కూతుళ్లను హత్య చేసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. సంఘటన స్థలాన్ని పోలీసులు క్లూస్‌టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో కలిసి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌ ప్రభుత్వ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బంధాలు బలహీనమవుతున్నాయా..

ఇటీవల కాలంలో కుటుంబ బంధాలు, ప్రేమ, మానవత్వం అన్నీ ఆస్తి అహంకారం, స్వార్థం ముందు కనుమరుగై పోతున్నాయని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. నవమాసాలు మోసి పెంచిన తలుల్లపైనే కొడుకులు దాడి చేసిన ఘనటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వృద్ధ తల్లిని కొట్టడం, ఆస్తి రాసివ్వలేదని వేధించడం వంటి ఘటనలు కలవరపెడుతున్నాయి. పెద్దవూర మండలంలోని పిన్నవూరలో సొంత బాబాయిని హత్య చేసిన సంఘటన గతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాంపత్య జీవితంలో అనుమానాలు, కుటుంబ కలహాలు కూడా నేరాలకు కారణమవుతున్నాయి. భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య విభేదాలతో హత్యలు.. ఇప్పుడు ఈ దారుణం.. సమాజం ఎటు వైపు వెళ్తుందోనన్న ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

సమాజానికి హెచ్చరిక

డబ్బు కోసం బంధాలను మరచిపోతున్నారు. ఆస్తి కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఈ పరిస్థితి సమాజానికి ప్రమాదకరం. కుటుంబాల్లో సంభాషనలు తగ్గిపోవడం, సహనం కోల్పోవడం, మానసిక ఒత్తిడులు పెరగడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. తప్పు చేసినవారు కచ్చితంగా శిక్షార్హులే. ఇబ్రహీంపేట సంఘటనలో నేరస్తులను వెంటనే పట్టుకుంటాం. – మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు

కళ్లల్లో కారం చల్లి..

ఊపిరాడకుండా చేసి..

అనుముల మండలం ఇబ్రహీంపేటలో

తల్లి, కూతురు దారుణ హత్య

ఆస్తి ముందు వెలవెలబోతున్న రక్తసంబంధాలు

Advertisement
 
Advertisement
Advertisement