వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు చౌటుప్పల్‌, వేములపల్లి, తిప్పర్తి మండలాల్లో చోటు చేసుకున్నాయి.

చౌటుప్పల్‌ : జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రానికి చెందిన అన్నెబోయిన మల్లేష్‌(45) మండల పరిధిలోని తూప్రాన్‌పేట గ్రామంలో గల హెచ్‌పీ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నాడు. రోజువారి మాదిరిగా డ్యూటీకి వెళ్లిన మల్లేష్‌.. శనివారం డ్యూటీ దిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో కై తాపురం గ్రామ స్టేజీ వద్ద విజయవాడ మార్గం నుంచి ఎదురుగా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మల్లేష్‌ బైక్‌ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే అంబులెన్స్‌లో చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ చింతలకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ..

వేములపల్లి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ ఘటన శనివారం రాత్రి వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులో గల నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై చోటుచేసుకుంది. వేములపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం రంగన్న కాలనీకి చెందిన జిల్లేపల్లి మదనాచారి అతడి భార్య గిరిజ (51) తమ ఆటోలో శనివారం ఉదయం నల్లగొండ పట్టణంలోని తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి తిరిగి అదే ఆటోలో మిర్యాలగూడకు బయలుదేరి వస్తుండగా.. శెట్టిపాలెం గ్రామ శివారులోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి వెంట గల హెచ్‌పీ బంక్‌ సమీపంలో రోడ్డుపై ఆపి ఉన్న లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో గిరిజ తలకు తీవ్ర గాయాలు కాగా.. మదనాచారి సైతం గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని 108 అంబులెన్స్‌ వాహనంలో మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గమధ్యలో గిరిజ మృతి చెందింది. తీవ్ర గాయాలైన మదనాచారి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుమారుడు జిల్లెపల్లి వెంకటాచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిజ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కారు ఢీకొని..

తిప్పర్తి : కారు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాతపెల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. తిప్పర్తి ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ తాళ్లగడ్డకు చెందిన చేకూరి వనజ (36) ఈనెల 16న రాత్రి తనకు తెలిసిన వ్యక్తి కిరణ్‌తో కలిసి చెరువుగట్టులో నిద్ర చేసింది. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడకు వెళుతుండగా పాతపెల్లి సమీపంలో బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో వనజ, కిరణ్‌లకు గాయాలయ్యాయి. వీరిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వనజ మృతి చెందింది. కిరణ్‌ చికిత్స పొందుతున్నాడు. వనజ కుమారుడు మనోజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement