కల్తీలను గుర్తించండి ఇలా..
● యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ వంటి ఎరువులు గుళికల రూపంలో ఉంటాయి.
● ఎరువులు ఇసుక రేణువుల రూపంలో, పొటాష్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి.
● 5 మిల్లీలీటర్ల నీటిలో ఒక స్పూన్ ఎరువును వేసి బాగా కలపాలి. ఇది స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమ్మోనియా క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి.
● యూరియా వంటి ఎరువును ఒక స్ఫూన్ ఐదు మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించాలి. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇదే పద్ధతిలో పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినా కల్తీ ఎరువుగా గుర్తించాలి.
పెద్దవూర: మరో పది, పదిహేను రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. రైతులు తమ వ్యవసాయ పొలాలను వానాకాలం సీజన్‌కు సిద్ధం చేసుకుని బోర్లు, బావుల కింద పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు పత్తి, మిరప విత్తనాలు సైతం కొనుగోలు చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వానాకాలం సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ, నాసిరకం విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. రైతులు ప్రైవేట్ కంపెనీల ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలు చూసి విత్తనాలను కొనుగోలు చేయొద్దు. విత్తనాల ప్యాకెట్లపై ప్రభుత్వ నిబంధనలు, వివరాలు సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. విత్తనాలు, పురుగుల మందు ఎంపిక, కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏఓ ఎన్. సత్యనారాయణ మాటల్లో..
విత్తనాల ఎంపికలో..
● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
● విత్తనాల కొనుగోలు రశీదులపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి.
● గడువు దాటిన విత్తనాలు, వదులుగా, చిరిగిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి ఇచ్చిన ప్యాకెట్లు కొనుగోలు చేయొద్దు.
● రశీదుపై విక్రయదారుని పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకాల పన్ను నంబరు, విక్రయదారుని గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేర్లు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి.
● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి.
● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయశాఖ అధికారి, శాస్త్రవేత్తలను సంప్రదించాలి.
● విత్తనాలు కొనుగోలు చేసిన రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం సంతప్తికరంగా ఉన్న వాటినే విత్తనాలుగా వాడాలి.
పురుగు మందుల ఎంపికలో..
● పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగుల మందులు కొనుగోలు చేయాలి.
● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడొద్దు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి.
● పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో పురుగు మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి.
● పురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలు ద్వంసం చేసి గుంతలో పూడ్చిపెట్టాలి.
● ఒక పంటకు వాడిన పురుగుల మందును మరో పంటకు శాస్త్రవేత్తల సూచనల మేరకు వాడాలి.
ఎరువుల కొనుగోలులో..
+ లైసెన్స్ దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. బిల్లులు, ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
+ మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులు మాత్రమే వాడాలి. ఒకవేళ చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి.
+ కొనుగోలు సమయంలో డీలరు రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారి సహకారంతో పరీక్షలకు పంపాలి.
+ చిల్లులు పడి, చిరిగిన ఎరువుల బస్తాలు కొనుగోలు చేయొద్దు. ఇతర పదార్థాలు కలిస్తే ఆ ఎరువును కల్తీగా గుర్తించాలి.
విత్తనాలు, ఎరువుల కొనుగోలులో భద్రం
కంపెనీల ప్రకటనలతో మోసపోవద్దు
గుర్తింపు పొందిన కంపెనీల విత్తనమే మేలు


