యువకుడి గొంతు కోసి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి గొంతు కోసి దారుణ హత్య

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

కోదాడ రూరల్‌ : ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కోదాడ మండలం గణపవరం స్టేజీ నుంచి బీక్యాతండా వెళ్లే మార్గంలోని మామితోట సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బలుగూరి మైసయ్య అలియాస్‌ మీరా సామ్రాజ్యం చిన్న కుమారుడు గణేష్‌(25) హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగం చేస్తూ వంట గ్యాస్‌ కొరత వల్ల ఆ ఉద్యోగం మానేసి నెలరోజుల క్రితం ఏపీ నుంచి ఇంటికి వచ్చాడు. గ్రామంలో క్యాటరింగ్‌ నిర్వహిస్తున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే గురువారం రాత్రి భోజనం చేసి 10 గంటల సమయంలో గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో జరుగుతున్న బరాత్‌ చూసేందుకు సత్యమ్మగుడి వద్దకు వెళ్తున్నాని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఎక్కడ లభించలేదు. దీంతో అనుమానమొచ్చి శుక్రవారం ఉదయం కోదాడ రూరల్‌ పోలీసు సేష్టషన్‌లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం మూడున్నర గంటల సమయంలో బీక్యాతండా రోడ్డులో ఉన్న మామిడి తోట వెనుక వైపు చెట్టు కింద రక్తపు మడుగులో చేతులను వెనుకకు టీషర్టుతో చేతులు కట్టేసి ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని అటుగా వెళ్లిన రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అప్పటికే మిస్సింగ్‌ కేసు ఫిర్యాదు ఇచ్చిన వారికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాం గణేష్‌దని నిర్ధారించుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మైసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ

హత్య జరిగిన ప్రదేశాన్ని శుక్రవారం సూర్యాపేట ఎస్పీ నరసింహ.. కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డిలతో కలిసి పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌, ఫింగర్‌ ప్రింట్‌ సిబ్బందిని పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతుడి, కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హత్యకు గల కారణాలను చేధించి నిందితులను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. జాగిలాలు ఒకటి గణపవరం స్టేజీ నుంచి తొగర్రాయి వద్దకు మరొకటి మేళ్లచెరువు రోడ్‌లో కొంత దూరం వరకు వెళ్లి ఆగాయి. ఈ హత్య ఎందుకు జరిగిందో , ఎవరు చేశారోనని గణపరం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కోదాడ మండలం గణపవరం

శివారులో ఘటన

ఘటన స్థలాన్ని పరిశీలించిన

ఎస్పీ నరసింహ

Advertisement
 
Advertisement
Advertisement